
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ కష్టం ఎవరికీ రాకూడదు. కివీస్ వరుస విజయాలు సాధిస్తున్నా బిజీ షెడ్యూల్ ఆ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారింది. పాకిస్థాన్ నుంచి దుబాయ్ కు తిరగడమే సరిపోయింది. భారత్ దుబాయ్ లోనే మ్యాచ్ కావడం కివీస్ కు ఇబ్బందిగా మారింది. బంగ్లాదేశ్ తో లీగ్ మ్యాచ్ గెలిచి సెమీ ఫైనల్ కు అర్హత సాధించిన న్యూజిలాండ్ ఆదివారం (మార్చి 2) భారత్ తో జరగబోయే చివరి లీగ్ మ్యాచ్ కోసం దుబాయ్ కు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం సెమీ ఫైనల్ పాకిస్థాన్ లో ఆడాల్సి ఉంది.
రెస్ట్ లేకుండానే ఆ జట్టు సోమవారం(మార్చి 3) లాహోర్ చేరుకోవాల్సి వచ్చింది. బుధవారం (మార్చి 5) సౌతాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన తర్వాత మళ్ళీ ఫైనల్ కోసం దుబాయ్ చేరుకోవాల్సి ఉంది. ఇలా న్యూజిలాండ్ పాకిస్థాన్ టూ దుబాయ్ తిరిగే పనిలోనే ఉన్నారు. దీంతో కివీస్ మానసికంగా, శారీరకంగా అలసిపోయారు. ఫైనల్ కు ముందు మూడు రోజులు రెస్ట్ దొరకడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. గురువారం పాకిస్థాన్ లో ఉండి శుక్రవారం (మార్చి 7) దుబాయ్ కు చేరుకోనుంది. ఆదివారం (మార్చి 9) భారత్ తో దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే షెడ్యూల్ పట్ల కివీస్ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు న్యూజిలాండ్ దూసుకెళ్లింది. బుధవారం (మార్చి 5) జరిగిన సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించడంతో 50 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించింది. ఆదివారం (మార్చి 9) భారత్ తో జరగబోయే టైటిల్ పోరులో అమీ తుమీ తేల్చుకోనుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగుకు ఆలౌటైంది.