PAK vs NZ: న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

PAK vs NZ: న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్.. వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

మహిళల టీ20 వరల్డ్ కప్ నుంచి భారత్ నిష్క్రమించింది. గ్రూప్ ఏ లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంతో భారత్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. 111 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. 54 పరుగుల తేడాతో గెలిచిన కివీస్.. రాయల్ గా సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఈ గ్రూప్ లో అంతకముందు ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి సెమీస్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఛేజ్ చేసే స్కోర్ తక్కువగా ఉన్నప్పటికీ పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కెప్టెన్ ఫాతిమా సనా (21), ఓపెనర్ మునీబ్ అలీ (15) మినహాయిస్తే మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కివీస్ బౌలర్లను కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. దీంతో మరీ దారుణంగా 56 పరుగులకే కుప్పకూలింది. నలుగురు పాక్ ఆటగాళ్లు డకౌట్ కావడం విశేషం. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా కెర్ మూడు వికెట్లు తీసుకోగా.. కార్సన్ రెండు వికెట్లు పడగొట్టింది.     

అంతకముందు మొదట బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆచితూచి ఆడింది. వికెట్లు కాపాడుకునే క్రమంలో స్కోర్ వేగం తగ్గింది. ఓపెనర్లు ఇద్దరూ జాగ్రత్తగా ఆడడంతో పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా 39 పరుగులు మాత్రమే రాబట్టింది. పవర్ ప్లే తర్వాత పాక్ ఒక్కసారిగా చెలరేగింది. ఓ వైపు వికెట్లు తీస్తూనే మరోవైపు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో కివీస్ స్కోర్ మరీ నెమ్మదించింది. స్లో బంతులు వేస్తూ న్యూజి లాండ్ ఆటలు కట్టించారు. దీంతో 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. 28 పరుగులు చేసిన బీట్స్ టాప్ స్కోరర్ గా నిలిచింది. పాక్ బౌలర్లలో నష్ర సందు మూడు వికెట్లు తీసుకుంది.