
న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20లో పాకిస్థాన్ భారీ తేడాతో ఓడిపోయింది. కనీస పోరాటం చూపించకుండానే చేతులెత్తేసింది. మౌంట్ మౌంగనుయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బౌలింగ్.. ఆ తర్వాత బ్యాటింగ్ లో పూర్తిగా విఫమైంది. 221 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 105 పరుగులకే కుప్పకూలింది. దీంతో 115 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
భారీ లక్ష్య ఛేదనలో పవర్ ప్లే లోనే పాక్ పరాజయం ఖాయమైంది. తొలి ఆరు ఓవర్లలో 42 పరుగులకు 5 వికెట్లను కోల్పోయింది. గత మ్యాచ్ సెంచరీ హీరో హసన్ నవాజ్ ఒక పరుగుకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మహమ్మద్ హారిస్ 2 పరుగులకే పెవిలియన్ కు చేరగా.. కెప్టెన్ సల్మాన్ అఘా ఒక పరుగుకే వెనుదిరిగాడు. దీంతో 9 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. షాదాబ్ ఖాన్ (1), ఖుషిడిల్ షా (6) కూడా సింగిల్ డిజిట్ కే ఔట్ కావడంతో పాక్ కోలుకోలేకపోయింది. చివర్లో యువ క్రికెటర్ అబ్దుల్ సమద్ 44 పరుగులు చేసి పాకిస్థాన్ జట్టును కనీసం 100 పరుగులకైనా చేర్చి పరువు నిలిపాడు.
ALSO READ : ఇంటర్ జోనల్ ఫార్మాట్‌లో దులీప్ ట్రోఫీ
పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో కేవలం ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు టీం సైఫర్ట్(44) ఫిన్ అలెన్ (50) ఆరంభంలో మెరుపులు మెరిపించారు. చివర్లో కెప్టెన్ బ్రేస్ వెల్ 26 బంతుల్లోనే 46 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఫిన్ అలెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య చివరిదైన ఐదో టీ20 బుధవారం (మార్చి 26) జరుగుతుంది.