Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్.. సెమీస్‌లో సఫారీలపై ఘన విజయం

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్.. సెమీస్‌లో సఫారీలపై ఘన విజయం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు న్యూజిలాండ్ దూసుకెళ్లింది. బుధవారం (మార్చి 5) జరిగిన సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించడంతో 50 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించింది. ఆదివారం (మార్చి 9) భారత్ తో జరగబోయే టైటిల్ పోరులో అమీ తుమీ తేల్చుకోనుంది.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచీన్ రవీంద్ర (101 బంతుల్లో 108:13 ఫోర్లు, ఒక సిక్సర్) వెటరన్ ప్లేయర్ కేన్ విలియంసన్ (94 బంతుల్లో 102:10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగుకు ఆలౌటైంది. మిల్లర్(67 బంతుల్లో 100:10 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన పోరాటం వృధా అయింది.    

363 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆరంభంలోనే వికెట్ ను కోల్పోయింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ బవుమా, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ జట్టును ఆదుకున్నారు. భారీ భాగస్వామ్యంతో జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. రెండో వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత సాంట్నర్ బవుమా (56) ను ఔట్ చేశాడు. ఇదే ఊపులో సాంట్నర్ విజృంభించి మరో రెండు వికెట్లు తీసుకొని సఫారీలను కష్టాల్లోకి నెట్టాడు. వాన్ డెర్ డస్సెన్(69), క్లాసన్ (3) లను కివీస్ కెప్టెన్ ఔట్ చేయడంతో మ్యాచ్ న్యూజిలాండ్ వైపుకు మళ్లింది. 

పట్టు బిగించిన కివీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లను తీస్తూ వచ్చారు. మార్కరం(31), మల్డర్(8), జాన్సెన్(3), మహరాజ్(1) పెవిలియన్ కు క్యూ కట్టారు. చివరి వరకు మిల్లర్(100*) క్రీజ్ లో ఉండి సెంచరీ చేసినప్పటికీ అతనికి సహకరించేవారు కరువయ్యారు.  దీంతో సౌతాఫ్రికా 312 పరుగులకే పరిమితమైంది. న్యూజిలాండ్  బౌలర్లలో సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టాడు. హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. రచీన్ రవీంద్ర, బ్రేస్ వెల్ కు తలో వికెట్ లభించింది.

అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ రచీన్ రవీంద్ర (108) కేన్ విలియంసన్ (102) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచీన్ రవీంద్ర 108 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిచెల్ 37 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఫిలిప్స్ 27 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో 49 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి మూడు వికెట్లు తీసుకున్నాడు. రబడా రెండు వికెట్లు పడగొట్టగా.. మల్డర్ కు ఒక వికెట్ దక్కింది.