సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డిలోని మాత శిశు ఆరోగ్య కేంద్రం నుంచి బుధవారం ఆడ శిశువు అపహరణకు గురైంది. పుట్టిన కొన్ని గంటల్లోనే శిశువు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దూదిగొండకు చెందిన నసీమా కాన్పు కోసం మంగళవారం రాత్రి సంగారెడ్డి మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. ఆమెకు బుధవారం సాయంత్రం ఆడ శిశువుకు పుట్టింది. తర్వాత కొద్దిసేపటికే శిశువు కనిపించకుండా పోయింది. గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్ సిబ్బంది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విషయం తెలుసుకున్న ఎస్పీ రూపేశ్ హాస్పిటల్ కు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం హాస్పిటల్ లోని సీసీ ఫుటేజీని పరిశీలించగా ముగ్గురు మహిళలు శిశువును ఎత్తుకెళ్తున్నట్లు కనిపించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు. కిడ్నాప్ చేసిన మహిళలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు.