దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో మధ్యప్రదేశ్ లో ఓ జంట పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశమంతా ఐక్యంగా లాక్ డౌన్ లో ఉన్న టైమ్ లో పుట్టిన బిడ్డ కావడంతో అది గుర్తుండి పోయేలా ఆ తల్లిదండ్రులు పేరు పెట్టారు.
తండ్రి ఐడియా.. ఓకే అన్న తల్లి..
మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లా బఛేరీ గ్రామానికి చెందిన రఘునాధ్ మాలి అనే రైతు భార్య మంజు (24)కు సోమవారం పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మంజు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. బర్త్ సర్టిఫికేట్ లో పేరు ఏం రాయాలని అడిగినప్పుడు రఘునాధ్ లాక్ డౌన్ అని చెప్పడంతో ఆస్పత్రి స్టాఫ్ ఆశ్చర్య పోయారు. కరోనా వైరస్ వల్ల గతంలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని పరిస్థితులను ఎదుర్కొంటున్నామని రఘు అన్నాడు. ఈ పరిస్థితిలో దేశమంతా ఒక్కటిగా నిలిచి ఇళ్లలో ఉండి వైరస్ ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమ బిడ్డకు లాక్ డౌన్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని తన భార్యకు చెప్పగానే తాను ఆనందంగా ఓకే చెప్పిందని తెలిపాడు.
కరోనా వైరస్ నుంచి దేశాన్ని కాపాడడం కోసం ప్రధాని మోడీ 21 రోజుల లాక్ డౌన్ కి పిలుపునిచ్చారు. ఈ క్రైసిస్ సమయంలో దేశమంతా ఐక్యంగా నిలిచింది. ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలని మా బిడ్డకు లాక్ డౌన్ అని పేరు పెట్టాం అని దంపతులిద్దరూ చెప్పారు.