కరీంనగర్ కేంద్రంలో హాస్పిటల్ నుంచి ఆడ శిశువు మాయం

కరీంనగర్, వెలుగు : కరీంనగర్ లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం నుంచి ఆడ శిశువును ఆదివారం ఉదయం గుర్తుతెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఆలస్యంగా గుర్తించిన బంధువులు హాస్పిటల్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీహార్ లోని ముజాఫర్ జిల్లాకు చెందిన నిర్మలాదేవి, మనోజ్ రాం దంపతులు బావుపేట గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్నారు. నిర్మలాదేవి డెలివరీ కోసం ఈ నెల 16న కరీంనగర్ లోని మాతా,శిశు ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ అయింది.

శనివారం రాత్రి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తర్వాత నిర్మలాదేవికి ఫిట్స్ రావడంతో ఐసీయూలో ట్రీట్ మెంట్ చేస్తుండగా, ఆమె దగ్గర మనోజ్ రాం తన ఏడేళ్ల కుమారుడిని ఉంచాడు.  శిశువును మరో వార్డులో బంధువుల సంరక్షణలో ఉంచిన మనోజ్ రాం ఆదివారం ఉదయం భోజనం తీసుకొచ్చేందుకు ఇంటికెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత మనోజ్ రాం కుమారుడు శిశువును ఎంట్రన్స్ వరకు తీసుకొచ్చి ఓ మహిళకు ఇచ్చాడు.

తర్వాత ఆ మహిళ శిశువును తీసుకొని ఆటోలో ఎక్కి వెళ్లిపోయింది. శిశువు కనిపించని విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బంధువులు వెంటనే హాస్పిటల్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు చెప్పారు. పోలీసులు హాస్పిటల్ కు వచ్చి బాలుడిని విచారించారు. అయితే తన కొడుకుకు ఏం తెలియదని మనోజ్ రాం చెప్పడం, ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వారిని స్టేషన్ కు తరలించి ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజీ ఆధారంగా మహిళ వెళ్లిన ఆటోను ట్రేస్ చేసే పనిలో పడ్డారు.