- ఇప్పటికీ గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యలు
- పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతున్న ప్రజలు
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న పాత సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పరిష్కారం కాని సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వమైనా పరిష్కరిస్తుందని జనం గంపెడాశలు పెట్టుకున్నారు.
తాగునీరు, సాగునీటి సౌకర్యాలతోపాటు రోడ్ల విస్తరణ, బ్రిడ్జిలు, కల్వర్టులు.. అనేక సమస్యలకు కొత్త ఎమ్మెల్యేలు పరిష్కారం చూపుతారనే ఆశతో జనం ఉన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నాలుగోసారి గెలిచిన గంగుల కమలాకర్ గతంలో చేపట్టిన పనులు అనేకం పెండింగ్ లో ఉన్నాయి. మానేరు రివర్ ఫ్రంట్, ఇంటిగ్రేటెడ్ వెజిటెబుల్ మార్కెట్, లైబ్రరీ బిల్డింగ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, హరిత హోటల్ పనులను పూర్తి చేయాల్సి ఉంది.
చొప్పదండిలో ప్రధాన సమస్యలివే..
చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన మేడిపల్లి సత్యం పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. చొప్పదండి మండలం గుమ్లాపూర్, కాట్నపల్లి, సాంబయ్యపల్లి, మంగళపల్లి గ్రామాల్లో చెరువులు నిండడం లేదు. వరద కాలువ నుంచి చెరువులు నింపాలనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది.
చొప్పదండి పట్టణంలోని కుడి చెరువును అభివృద్ధి చేసి మినీట్యాంక్ బండ్ గా మార్చాలనే డిమాండ్ ఉంది. చొప్పదండి పట్టణంలోని సీసీ రోడ్లన్నీ అధ్వాన స్థితిలో ఉన్నాయి. రామడుగు మండల కేంద్రంలోని మోతె వాగుపై ఉన్న బ్రిడ్జి శిథిలావస్థకు చేరి వరద సమయంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. 2019లో కొత్త బ్రిడ్జి పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ పూర్తికాలేదు.
గంగాధర మండలంలో గర్శకుర్తిని, రామడుగు మండలంలోని గోపాల్ రావుపేటను మండల కేంద్రాలుగా మార్చాలనే డిమాండ్ ఉంది. నారాయణపూర్ రిజర్వాయర్ ముంపుగ్రామాలైన నారాయణపూర్, చర్లపల్లి (ఎన్), మంగపేట, ఇస్తారిపల్లి గ్రామాల ప్రజలు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. బోయినిపల్లి మండలంలోని మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నిర్వాసిత సమస్యలున్నాయి. కొడిమ్యాల మండలంలో ఎన్నో ఏళ్ల నుంచి అసంపూర్తిగా ఉన్న పోతారం ప్రాజెక్టు మత్తడి నిర్మాణం పూర్తి కాలేదు.
జమ్మికుంట ఫ్లై ఓవర్ తొలగేనా ?
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ ను తొలగిస్తామని వ్యాపారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అలాగే హుజూరాబాద్ లో మినీ స్టేడియం నిర్మాణం, జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కాలేజీ మైదానాన్ని స్టేడియంగా మార్చడం, నాయిని చెరువును పర్యటన కేంద్రంగా తీర్చిదిద్దడం, కమలాపూర్ ను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయడం, జమ్మికుంట మండలంలోని వావిలాల, వీణవంక మండలంలోని చల్లూర్, కమలాపూర్ మండలంలోని శనిగరం, ఉప్పల్ ను మండలాలుగా ఏర్పాటు చేయడంలాంటి డిమాండ్ల పరిష్కారానికి కౌశిక్ రెడ్డి కృషి చేయాల్సి ఉంది.
మానకొండూరులో రోడ్ల సమస్య..
గత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హయాంలో మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి అంతంతమాత్రంగానే జరిగింది. దీంతో తాజా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై నియోజకవర్గ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల రోడ్లు అధ్వానంగా మారాయి. మానకొండూరు మండలంలో ఇసుక లారీల రాకపోకల కారణంగా రోడ్లు ధ్వంసమయ్యాయి.
గన్నేరువరం మండలంలో గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రూ.71 కోట్లతో మంజూరైన డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. వర్షాకాలంలో తిమ్మాపూర్ మండలంలోని జూగుండ్ల, రామ్ హనుమాన్ నగర్, వచ్చునూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. కల్వర్టు నిర్మాణం చేపడితే ఈ సమస్య పరిష్కారమవుతుంది.
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకునేనా?
జగిత్యాల : జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గెలిచిన వెంటనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. కొండ్రికర్ల బ్రిడ్జి నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు.
తన తండ్రి విద్యాసాగర్ హయాంలో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తామన్నారు. కోరుట్లలో జంబిగద్దె వద్ద పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తానని, నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. మెట్ పల్లి లో 100 బెడ్స్ హాస్పిటల్ బిల్డింగ్ పనులు ఇంకా నడుస్తున్నాయి. సంగెం బ్రిడ్జి నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ధర్మపురిలో తాగునీటి ఎద్దడి తీరేనా ?
ధర్మపురి నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది. బీఆర్ఎస్ సర్కార్ మిషన్ భగీరథ ఏర్పాటు చేసినా ప్రణాళిక లేకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. ఎల్లంపల్లి ముంపు గ్రామాల యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పించడంలో గత పాలకులు విఫలం కావడంతో ఎమ్మెల్యే అడ్లూరిపై జనం ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లోని గోదావరి లో పట్టణంలోని డ్రైనేజీ వాటర్ కలవడం తో భక్తులు తీవ్ర అసంతృప్తి
వ్యక్తమవుతోంది.
వేములవాడలో రోడ్ల విస్తరణ జరిగేనా ?
రాజన్నసిరిసిల్ల : వేములవాడ పట్టణంలో రాజన్న ఆలయం ముందు ఉన్న ఇరుకు రోడ్డుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరువైపులా ఉన్న దుకాణదారులను ఒప్పించి ఈ రోడ్డు విస్తరణ చేయడం ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్ కు ఓ పెద్ద సవాల్ గా మారనుంది. అలాగే ఆలయం అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించాల్సి ఉంది. పెండింగ్ లో ఉన్న కలికోట సూరమ్మ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సి ఉంది. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలు తీర్చాల్సి ఉంది.
కాళేశ్వరం ముంపు బాధితుల ఎదురుచూపులు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో పదేళ్లుగా పెద్దపల్లి జిల్లాలో పరిష్కారం కాని సాగు, తాగునీటి సమస్యలతో పాటు మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన శానిటేషన్ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఆశపడుతున్నారు. జిల్లాలో కాళేశ్వరం ముంపు భూముల సమస్య ఐదేళ్లుగా అలాగే ఉంది.
కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో సుమారు 40 వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ వీళ్ల సమస్యను పట్టించుకోలేదు. మంథని నియోజకవర్గంలోని పోతారం లిఫ్ట్, పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మానేరుపై గుంటిమడుగు రిజర్వాయర్లు నిర్మించడానికి డీపీఆర్‌లు పూర్తయ్యాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక వాటి నిర్మాణ పనులు నిలిచిపోయాయి.