
- పేరుకు ముగ్గురు డాక్టర్లు.. వైద్య సేవలు మాత్రం అందట్లే..
మనోహరాబాద్, వెలుగు : మెదక్ జిల్లా మనోహరాబాద్ లో కొత్తగా ఏర్పాటు చేసిన పీహెచ్సీ నామమాత్రంగా మారింది. ముగ్గురు డాక్టర్లను కేటాయించారు కానీ, వారు సరిగా డ్యూటీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి హెల్త్ మినిస్టర్జిల్లాలో, సీఎం నియోజకవర్గంలో నెలకొనడం గమనార్హం. తూప్రాన్ డివిజన్ కేంద్రంలో 50 బెడ్ ల గవర్నమెంట్ హాస్పిటల్ ను ప్రారంభించడంతో అక్కడున్న పీహెచ్‌సీని మనోహరాబాద్ మండలంలో ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు రెండేండ్లు పోరాటం చేశారు. దీంతో హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు ఆదేశాలతో తూప్రాన్ పీహెచ్‌సీని మనోహరాబాద్ కు షిఫ్ట్ చేశారు.
అక్కడ పనిచేస్తున్న డాక్టర్ ఆనంద్ తోపాటు స్టాఫ్‌ను మనోహరాబాద్ పీహెచ్‌సీకి బదిలీ చేశారు. ఈ మండలంలోని 17 గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కొత్తగా మరో ఇద్దరి డాక్టర్లను ఈ పీహెచ్‌సీకి అలాట్చేశారు. అయితే డాక్టర్ ఆనంద్ లాంగ్ లీవ్ పెట్టి మూడు నెలల నుంచి హాస్పిటల్ కు రావడం లేదు. మిగతా డాక్టర్లు షిఫ్టుల వారీగా విధులకు హాజరవుతుండటంతో పీహెచ్‌సీకి వస్తున్న రోగులకు సరైన సేవలందడం లేదు. చాలా సందర్భాల్లో వెయిటింగ్ చేసి డాక్టర్ రాకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్తున్నారు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పీహెచ్సీలో సరైన వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు.