
పెద్దలు కుదిర్చిన పెళ్లి.. అగ్ని సాక్షిగా వేద మంత్రాలతో జరిగిన వివహం. పట్టుమని పది నెలలు కూడా కాలేదు. గుండెకు రంధ్రం ఉదన్న విషయం ఆ కొత్త దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. చివరికి వివాహిత ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకెళ్లింది.
వివరాల్లోకి వెళ్తే.. భర్త, అత్తింటి వేధింపులు తాళలేక ఓ నవ వధువు పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్ పూర్ లో గురువారం ఉదయం 11 గంటలకు జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
భోలక్ పూర్ కు చెందిన సౌజన్యకు మూసాపేటకు చెందిన జిమ్ నిర్వాకుడు శబరీష్ యాదవ్ తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో సౌజన్యకు గుండెలో రంధ్రం ఉందని చెప్పకుండా పెళ్లి చేశారని కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. నాలుగు నెలల నుంచి భర్త అత్త వాళ్ళ కుటుంబ సభ్యులు సౌజన్యను నిత్యం వేధిస్తున్నారు. ఈ విషయం చెప్పనందుకు అదనపు కట్నవు బంగారం తీసుకురావాలని వేధింపులు ఎక్కువ చేశారు. పలుమార్లు నవవధువు సౌజన్యను పుట్టింటికి పంపించి వేశారు.
బుధవారం ఉదయం అత్తవారింటికి కుటుంబ సభ్యులతో వెళ్లిన శబరీష్ యాదవ్.. అత్తమామలతో గొడవపడి భార్య సౌజన్య తనకు అవసరం లేదంటూ పంపించి వేశారు. దీంతో మనస్థాపన చెందిన సౌజన్య గురువారం ఉదయం 11 గంటలకు సమయంలో మూడంతస్తుల భవనం పైకి వెళ్లి దూకి ఆత్మహత్య చేసుకుంది. తలకు తీవ్ర గాయాలైన ఆమెను చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా.. కొద్దిసేపటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తింటి వారి వేధింపుల వల్లే నవవధువు ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసుకుని ముషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.