గొల్లపల్లిలో కట్నం వేధింపులకు నవవధువు బలి

గొల్లపల్లిలో కట్నం వేధింపులకు నవవధువు బలి
  • పెండ్లయిన 24 రోజులకే సూసైడ్  చేసుకున్న శ్రుతి
  • మంచిర్యాల జిల్లా గొల్లపల్లిలో ఘటన 

మంచిర్యాల, వెలుగు: కట్నం వేధింపులు తాళలేక పెండ్లయిన 24 రోజులకే నవ వధువు సూసైడ్​ చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా హాజీపూర్  మండలం టీకనపల్లికి చెందిన కంది కవిత, శ్రీనివాస్  దంపతుల చిన్నకూతురు శ్రుతి(22)ను గొల్లపల్లికి చెందిన గర్షకుర్తి సాయి(25)కి ఇచ్చి మార్చి 16న పెండ్లి జరిపించారు. కట్నంగా ఎనిమిదిన్నర తులాల బంగారం, వెండి, రూ.5లక్షల నగదుతో పాటు ఇతర లాంఛనాలు ఇచ్చారు.

పెండ్లయిన మూడు రోజుల నుంచే భర్త సాయి, అత్తమామలు లక్ష్మి, శంకరయ్య అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. పెండ్లికి రూ.6 లక్షల ఖర్చయిందని, ఈ మొత్తాన్ని తీసుకురావాలని ఒత్తిడి చేశారు. విషయం తెలుసుకున్న కవిత, శ్రీనివాస్  వారం రోజుల కింద రూ.50 వేలు ఇచ్చి, మిగతా సొమ్ము తొందరలో ఇస్తామని నచ్చజెప్పి వచ్చారు. మళ్లీ ఈ నెల 7న రూ.2లక్షలు తేవాలని వేధించడంతో, రాత్రి 10 గంటల టైమ్ లో గొల్లపల్లికి వెళ్లి మరో రూ.50వేలు ముట్టజెప్పారు.

20 తారీఖు వరకు మిగతా డబ్బులు ఇస్తామని చెప్పారు. కూతురిని తమతో పంపాలని కోరగా అల్లుడు సాయి అందుకు నిరాకరించడంతో కవిత, శ్రీనివాస్  టీకనపల్లికి వెళ్లిపోయారు. ఈక్రమంలో మనస్తాపానికి గురైన శ్రుతి మంగళవారం ఉదయం అత్తగారి ఇంట్లోని బాత్రూంలో చున్నీతో ఉరి వేసుకొంది. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని మంచిర్యాల జీజీహెచ్ కు తరలించారు. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు. అత్తమామలు లక్ష్మి, శంకర్ ను అదుపులోకి తీసుకోగా, సాయి పరారీలో ఉన్నాడు.

వేధింపులు భరించలేక వివాహిత సూసైడ్​

ఎల్కతుర్తి: భర్త, అత్త వేధింపులు భరించలేక హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన వివాహిత సూసైడ్​ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణంలోని గణేశ్​నగర్​కు చెందిన పంచకోటి సదానందచారి కూతురు హిమబిందు(34)ను, ఎల్కతుర్తి మండలం సూరారం విలేజ్​కు చెందిన శ్రీరామోజు రమేశ్​ చారికి ఇచ్చి16 ఏండ్ల కింద పెండ్లి చేశారు. అప్పటి నుంచి హిమబిందును శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.

ఈ విషయమై పెద్ద మనుషుల వద్ద పంచాయితీ నిర్వహించారు. కానీ, రమేశ్​చారిలో మార్పు రాకపోవడంతో హిమబిందు రెండు నెలల కింద పుట్టింటికి వెళ్లింది. మళ్లీ పంచాయితీ నిర్వహించి, ఈ నెల 4న అత్తగారింటికి పంపించారు. రమేశ్ చారి, తల్లి లక్ష్మితో మంగళవారం గొడవ జరగడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సదానందచారి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్​కుమార్​ తెలిపారు.