ప్రాణం తీసిన పొగమంచు.. నవ దంపతులు సహా ఏడుగురు మృతి

ప్రాణం తీసిన పొగమంచు.. నవ దంపతులు సహా ఏడుగురు మృతి
  • రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు సహా ఏడుగురు మృతి
  • జార్ఖండ్​లో పెళ్లి చేసుకొని తిరిగొస్తుండగా ఘటన
  • యూపీలోని బిజ్నోర్​లో విషాదం..సీఎం యోగి సంతాపం

బిజ్నోర్: పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారి కనిపించక ముందు వెళ్తున్న ఆటోను కారు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో నవ దంపతులు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లోని బిజ్నోర్​లో శనివారం జరిగింది. ధాంపూర్​లోని తిబ్డి గ్రామానికి చెందిన యువకుడికి జార్ఖండ్​కు చెందిన యువతితో శుక్రవారం సాయంత్రం వివాహం జరిగింది. వధువుతో కలిసి వరుడు, కుటుంబ సభ్యులు మొత్తం 11 మంది  ఆటోలో ధాంపూర్​కు బయలుదేరారు.

కాగా, నేషనల్​హైవే –74పై బిజ్నోర్​ వద్ద శనివారం ఉదయం పూట భారీగా పొగమంచు కమ్ముకున్నది. దీంతో ముందు వెళ్తున్న మరో వాహనాన్ని తప్పించబోయిన క్రెటా కారు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవదంపతులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. ఆటో డ్రైవర్ దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు పోలీసులు తెలిపారు. వధువుకు స్వాగతం పలికేంwదుకు వరుడి ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవదంపతులు వస్తారని ఎదురు చూసిన వారికి మృతదేహాలు కనిపించడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

పొగమంచు వల్లే ప్రమాదం: పోలీసులు

పొగమంచు కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగినట్టు యూపీ పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ముందు వెళ్తున్న టెంపోను తప్పించబోయిన కారు..నవదంపతులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టిందని తెలిపారు. ఈ ప్రమాదంలో కొత్త జంట సహా ఆ కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే చనిపోయారని తెలిపారు. ఆటో డ్రైవర్​ను దవాఖానకు తరలించామని, చికిత్స పొందుతూ మృతిచెందాడని చెప్పారు.

గాయపడ్డవారిని సమీప కమ్యూనిటీ హెల్త్​ సెంటర్​కు తరలించి, చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. కారు డ్రైవర్​కూడా గాయపడ్డాడని, అతడిపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. కాగా, ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.