- కాళేశ్వరం బ్యాక్‌వాటర్ భూముల రైతులకు కొత్త కష్టాలు
- క్రాప్‌హాలీడే ఎత్తేసినమని.. సాగు చేసుకోమంటున్న ఆఫీసర్లు
- ముంపు నీటిలో పాడైన బోర్లు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు
- పంట భూములకే రైతు భరోసా అంటున్న రాష్ట్ర సర్కార్
- దిక్కుతోచని స్థితిలో బాధిత రైతులు
పెద్దపల్లి, వెలుగు: కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ఐదేండ్లుగా భూములు నీటిలో మునిగిపోయాయి. ప్రాజెక్ట్ లోని నీటిని కిందికి వదలడంతో ఇప్పుడు ముంపు భూములన్నీ పైకి తేలాయి. ఇప్పటికే నాలుగేండ్లుగా కొనసాగుతున్న క్రాప్ హాలీడేను కూడా అధికారులు ఎత్తేశారు. ఇగ భూములు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అయితే.. ఇప్పటికే బ్యాక్‌వాటర్ ముంపుతో బాధిత రైతుల వ్యవసాయ బోర్లు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు నీట మునిగిపోయాయి. మరో వైపు సాగులోని భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రస్తుత సర్కార్ చెప్తుండడంతో రైతులు ఏం చేయాలో తెలియని ఆందోళనలో పడిపోయారు. ఇదీ పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద, మల్లారం తదితర గ్రామాల్లోని దాదాపు 500 ఎకరాలపైగా బ్యాక్ వాటర్ ముంపు భూముల పరిస్థితి.
తామేం చేయలేమంటున్న ఆఫీసర్లు
బ్యాక్‌వాటర్ ముంపునకు గురైన భూములకు ఐదేండ్ల కింద గత బీఆర్ఎస్ సర్కార్ క్రాప్ హాలిడే ప్రకటించింది. కొన్ని పంటలకు ఇచ్చింది. ఇంకా నాలుగు పంటలకు పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. ముంపు భూములన్నీ పైకి తేలాయి. దీంతో ఇకముందు ఆ భూములకు క్రాప్ హాలిడే లేదని అధికారులు చెప్పినట్లు రైతులు పేర్కొంటున్నారు.
భూములను సాగు చేసుకోవాలని కూడా సూచించార ని చెప్తున్నారు. అధికారులు చెప్తున్నట్టుగా భూములు సాగు చేసుకోవాలంటే బోర్లు, కరెంటు మోటార్లు, కరెంటు ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉంది. ముంపుతో ఏ ఒక్కటి కూడా పనికి రాకుండా పోయాయి. దీంతో సంబంధిత అధికారులను సంప్రదిస్తే తామేం చేయలేమని చేతులెత్తేసినట్లు రైతులు చెప్తున్నారు. ఒకవైపు క్రాప్‌హాలిడే లేదు, మరోవైపు భూములు సాగు చేయలేని స్థితి నెలకొంది. దీంతో రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా భూములు సర్కారే తీసుకోవాలె
క్రాప్‌హాలిడే లేదు. సాగు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ రూ.లక్షలు ఖర్చు చేసి మళ్లీ బోర్లు వేసుకొని సాగు చేస్తే, భవిష్యత్‌లో బ్యాక్వాటర్రాదనే నమ్మకం లేదు. భూములు ఉండి కూడా సాగుచేసుకోలేకపోతున్నం. రెండు విధాలుగా నష్టపోతున్నం. మా భూములను సర్కారే తీసుకొని ఆదుకోవాలి. రైతులకు రావాల్సిన క్రాప్‌హాలిడే పరిహారం వెంటనే ఇవ్వాలి.
– సుంకరి బాపు, మల్లారం, పెద్దపల్లి జిల్లా-