సిరిసిల్ల కలెక్టరేట్,వెలుగు: క్రియేటివిటీ ఉంటేనే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఐటీ మినిస్టర్ కేటీఆర్ అన్నారు. సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్(2022)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశం అభివృద్ధి చెందిన అగ్రశ్రేణి దేశాల సరసన నిలబడాలంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లుసివ్ గ్రోత్ అనే మూడు అంశాలపై గట్టిగా నిలబడితేనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్ ద్వారా ఎంపిక చేసిన 33 జిల్లాలకు చెందిన ఆవిష్కర్తలతో గూగుల్ మీట్ ద్వారా మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్‌ద్వారా ఎంపిక చేసిన ఆవిష్కరణలు మన సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్నాయన్నారు. అందుకు సిరిసిల్ల జిల్లా నుంచి ఎంపికైన ప్రదర్శనలే ఉదాహరణ అని అన్నారు. ప్రపంచంలో అత్యధిక యువత మన దేశంలో ఉన్నారని, వారిని సరైన దిశలో పెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ- హబ్, వీ- హబ్, అగ్రి హబ్, కే హబ్, బీ- హబ్ అనేక కొత్త ఆవిష్కరణలకు వేదికలు అవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, జడ్పీ చైర్పర్సన్అరుణ, అడిషనల్కలెక్టర్లు బి సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బస్తీ దవాఖానా ప్రారంభించిన మినిస్టర్
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్‍లోని రేకుర్తిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను సోమవారం మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, ఇతర ఆరోగ్య సేవలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ రామకృష్ణారావు, జడ్పీ చైర్ పర్సన్ విజయ, డీఎంహెచ్‍ఓ జువేరియా పాల్గొన్నారు.
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్దాడి చేయడాన్ని ఖండిస్తూ కరీంనగర్‍లోని తెలంగాణ చౌక్‍లో బీజేపీ లీడర్లు సోమవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పాదయాత్ర చేస్తున్న సంజయ్ పై దాడి చేయడం టీఆర్ఎస్ గుండాయిజానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ యాదవ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కోనరావుపేట: బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లాలో బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రపై టీఆర్ఎస్ దాడికి నిరసనగా సోమవారం కోనరావుపేటలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలాధ్యక్షుడు గొట్టే రామచంద్రం మాట్లాడుతూ సంగ్రామ యాత్రలో పాల్గొంటున్న జనాలను చూసి టీఆర్ఎస్ ఓర్వలేకపోతుంతోందన్నారు. కార్యక్రమంలో బీజేపి ఉపాధ్యక్షుడు మోహన్, వెంకటి, బీజేవైఎం మండలాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడి
కోరుట్ల,వెలుగు: పట్టణంలోని భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తోకల జనార్దన్ పై సోమవారం కత్తెరతో దాడి జరిగింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా అడ్డొచ్చిన కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. జనార్దన్ కోరుట్లలో కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కల్లూరు రోడ్డులోని ఓ భూమిని పొట్టవర్తిని నర్సయ్యకు సుమారు 17 ఏళ్ల క్రితం జనార్దన్ విక్రయించాడు. కాగా ఆ భూమి విక్రయం విషయంలో ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 8 నెలల క్రితం భూమికి సంబంధించి డబ్బులు ఇస్తానని వీరిద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. సోమవారం సాయంత్రం జనార్దన్ ఇంటికి నర్సయ్య, భార్య పద్మ, కుమారుడు ప్రసాద్వచ్చారు. ఈక్రమంలో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి జనార్దన్ పై కత్తెరతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. అడ్డం వచ్చిన కూతురు మాధురికి స్వల్ప గాయమైంది. దీంతో వారిని కోరుట్ల ప్రభుత్వాస్పపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నర్సయ్య, పద్మ, ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సతీశ్తెలిపారు.
75 ఏండ్లు నిండిన మాజీ ఉద్యోగులకు సన్మానం
గోదావరిఖని, వెలుగు: స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో ఉద్యోగం చేసి రిటైర్అయిన నలుగురు 75 ఏండ్లు నిండినవారిని సోమవారం సన్మానించారు. వారిలో పి.శంకరయ్య, కేఆర్ రెడ్డి, కేబీ రెడ్డి, బీబీ రావు ఉన్నారు. కార్యక్రమాలలో డిపో మేనేజర్ పి.మల్లేశం, అసిస్టెంట్ మేనేజర్(టి) రవికుమార్, అసిస్టెంట్ ఇంజనీర్(ఎం) వీరాస్వామి పాల్గొన్నారు.
గ్రామాలకు ‘ఉత్తమ’ అవార్డులు
తిమ్మాపూర్, వెలుగు: 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని పర్లపల్లి గ్రామం ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. 2021, జనవరి 26న ఉత్తమ జీపీగా అప్పటి కలెక్టర్ శశాంక చేతుల మీదుగా అవార్డు అందుకోగా.. మళ్లీ ఇదే ఏడాది ఏప్రిల్ లో పండిట్ దీన్‌దయాళ్ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో ఉత్తమ జీపీగా ఎంపికై సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు దక్కించుకుంది. సోమవారం మంత్రి గంగుల కమలాకర్ పర్లపల్లి సర్పంచ్ మాదాడి భారతి నర్సింహారెడ్డికి అవార్డు అందించారు.
కాకా విగ్రహం వద్ద స్వాతంత్య్ర వేడుకలు
సుల్తానాబాద్, వెలుగు: పట్టణంలో కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) విగ్రహం వద్ద 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తెలంగాణ మాదిగ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకా విగ్రహానికి పారుపల్లి సజయ్ పూలమాలలు వేసి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆరెపల్లి రాహుల్, నరసింహారెడ్డి, అరుణ్, శ్రీశైలం, సూరి, మీరా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.