రాజా బహదూర్ విద్యాభివృద్ధికి కృషి చేసిండు
పాలమూరు, వెలుగు: రాజా బహదూర్ వెంకట్ రామారెడ్డి విద్యాభివృద్ధికి కృషి చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. సోమవారం రాజా బహదూర్ 154 జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకట్ రామారెడ్డి మహబూబ్ నగర్‌లో పుట్టడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. రెడ్డి హాస్టల్ స్థాపించడంతో పాటు భాషా నిలయాలు, గ్రంథాలయాలకు సహకారం అందించారని గుర్తు చేశారు.
బైపాస్ రోడ్ పనులను పరిశీలించిన మంత్రి
జిల్లా కేంద్రంలో రామ్‌రెడ్డి కంటి ఆస్పత్రి వద్ద జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను సోమవారం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దని త్వరగా పూర్తిచేశాయాలని సూచించారు. ఎస్పీఎస్ నుంచి భూత్ఫూర్ రోడ్డు వరకు ఉండే వివిధ కాలనీల నుంచి లింక్ రోడ్లు వేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామన్నారు.
నేడు జూనియర్ కాలేజీల బంద్
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: స్టూడెంట్ ఆత్మహత్యకు కారణమైన నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం జూనియక్ కాలేజీల బంద్ చేపట్టనున్నట్లు ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు. సోమవారం సంఘం ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కార్పొరేట్ కాలేజీల ధనదాహానికి అనేక మంది స్టూడెండ్స్ బలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కార్పొరేట్ కాలేజీలో జరిగిన ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
ఎమ్మెల్సీ కవితపై సీబీఐ ఎంక్వైరీ చేయాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందనిఆరోపణలు వస్తున్నాయని, దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కందికొండ గీత డిమాండ్ చేశారు. సోమవారం ఐద్వా కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ లిక్కర్ మాఫియా దక్షిణాది రాష్ట్రాల నుంచి మద్యం తీసుకెళ్లి ఢిల్లీలో దందా
చేస్తున్న వారిలో కవిత పేరు బయటికి రావడంపై రాష్ట్ర సర్కారు క్లారిటీ ఇవ్వాలన్నారు. ఆరోపణ చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని అంటున్న కవిత.. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ కోరాలని సూచించారు. ఢిల్లీలో పోలీసు వ్యవస్థ కేంద్రం ఆధీనంలో ఉంటుందని, ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో నిర్మల, సునీత, అలివేల ఉన్నారు.
వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేదాకా పోరాటం
గద్వాల, నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేదాకా పోరాటం ఆపేది లేదని ఆ సంఘం నేతలు స్పష్టం చేశారు. సోమవారం గద్వాల, నాగర్ కర్నూల్ కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించారు. అంతకుముందు జిల్లా కేంద్రాల్లో ర్యాలీ తీశారు. గద్వాల కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయగా.. వాటిని తొలగించి ఆఫీస్ ముందు బైఠాయించారు. నాగర్ కర్నూల్‌లో వాల్మీకి సంక్షేమ సంఘం రాష్ట్ర నేత వెంకట్ నారాయణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. చెల్లప్ప కమిటీ పేరుతో కాలయాపన చేశారని, నివేదిక ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే పలు రాష్ట్రాలు వాల్మీకులను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాయని, తెలంగాణలోనూ చేర్చాలని కోరారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్లును కేంద్రానికి పంపాలని సూచించారు. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రం అందించారువాల్మీకి సంక్షేమ సంఘం నాయకులు వెంకటయ్య, ఆంజనేయులు, పరుశరాములు, పురుషోత్తం, సురేశ్, మల్లేశ్, లింగం, గట్టు తిమ్మప్ప, రామాంజనేయులు, వీరు బాబు పాల్గొన్నారు.
ఎమర్జెన్సీ పనులకే డీఎంఎఫ్‌టీ ఫండ్స్
గద్వాల, వెలుగు: జిల్లాలో ఎమర్జెన్సీ పనులకే డీఎంఎఫ్‌టీ (జిల్లా మినరల్ ఫండ్ ట్రస్ట్ కమిటీ) వాడుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో కలెక్టర్ వల్లూరు క్రాంతి, జడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహంతో కలిసి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో డీఎంఎఫ్‌టీ కింద రూ.3.30 కోట్లు నిధులు జమ అయ్యాయన్నారు. ఇందులో 15 శాతం పరిపాలన ఖర్చులు పోను మిగతా నిధులను రెండు నియోజకవర్గాల్లో ఎమర్జెన్సీ పనులకు వాడుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలలో ఎక్కడెక్కడ పనులు పెండింగ్ ఉన్నాయో రిపోర్టులు తెప్పించుకోవాలని అడిషనల్ కలెక్టర్ల శ్రీహర్షను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో పనులు కంప్లీట్ చేయాలని ఆదేశించారు.
కలెక్టరేట్ బిల్డింగ్‌ను దసరా నాటికి కంప్లీట్ చేయాలి
కొత్త కలెక్టరేట్‌ను దసరా నాటికి కంప్లీట్ చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కొత్త కలెక్టరేట్ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. డస్ట్ క్లీనింగ్, ఫర్నిచర్ వర్క్స్, కరెంట్, తాగునీరు తదితర పనులను స్పీడప్ చేయాలని సూచించారు. అనంతరం వజ్రోత్సవాల ముగింపుకు వెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
బోనాలు, బతుకమ్మలతో నిరసన
నారాయణపేట, వెలుగు: తమ డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న వీఆర్‌ఏలు రోజుకో తీరులో నిరసన తెలుపుతున్నారు. సోమవారం నారాయణపేటలో బోనాలు, బుతకమ్మలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వీఆర్‌ఏలు పోతరాజుల వేషం వేశారు. అనంతరం మున్సిపల్ పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. వీరికి మాజీ ఎమ్మెల్యే కొత్తకొట దయాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు రాచప్ప, రాష్ట్ర జేఏపీ కో కన్వీనర్ గోవిందు, కో చైర్మన్ కనకప్ప , కన్వీనర్ కృష్ణ , జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, నేతలు రాజు , వీరప్ప,అశోక్,శ్యామప్ప, యాదయ్య, సత్యయ్య, అంజప్ప, వినోద్, లలిత, రాములు, హన్మంతు
తదితరులు పాల్గొన్నారు.
పాలమూరు పనులతో కేఎల్‌ఐకి ప్రమాదం
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్ పనుల్లో బ్లాస్టింగ్ కారణంగా కేఎల్‌ఐకి ప్రమాదం జరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. పాలమూరు, కేఎల్‌ఐకి పెద్దగా దూరం లేకపోవడం, అండర్ గ్రౌండ్‌ల్లో పనులు చేపట్టడంతో కేఎల్‌ఐ పంప్‌హౌస్‌పై ప్రభావం పడుతోందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కేఎల్‌ఐకి ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ వ్యక్తులకు ప్రజాధనాన్ని కట్టబెట్టడం తప్ప, చేసిందేమీ లేదన్నారు. ఈనెల 24, 25 తేదీలలో సీపీఐ రెండవ మహాసభలను నాగర్ కర్నూల్‌లో నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆనంద్, కేశవులు గౌడ్, భరత్, శివశంకర్ పాల్గొన్నారు.