మెదక్, వెలుగు: రెండు, మూడు తరాలుగా తాము సాగు చేసుకుంటున్న లావాణి భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కౌడిపల్లి మండలం భుజరంపేట గ్రామ పంచాయతీ పరిధి వెంకటాపూర్ కు చెందిన పలువురు రైతులు సోమవారం మెదక్ కలెక్టరేట్ ముందు పెట్రోల్ బాటిళ్లలో ఆందోళనకు దిగారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన నెల్లి ముత్తయ్య, నెల్లి రమేశ్, నెల్లి కృష్ణ, తొండ్రు మల్లయ్య, పాషా, నెల్లి రాములు, రాములు, దూదేకుల ఆబేద్, పెద్ది యాదగిరి, పెద్ది శ్రీను, మన్నె లక్ష్మయ్య, పుల్లయ్య తదితరులు కొల్చారం మండలం సంగాయిపేట శివారులోని 298, 313 సర్వే నంబర్లలో దాదాపు 25 ఎకరాల లావాణి భూములను చాలాకాలంగా సాగు చేసుకుంటున్నారు.
అయితే సంగాయి పేట తండా కు చెందిన గిరిజనులు ఆ భూములు తమవేనని అంటున్నారని, భూముల వద్దకు వెళితే దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. కొల్చారం రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. దీంతో కలక్టరేట్ముందు బైఠాయించారు. భూములు పోతే తమకు చావే శరణ్యమవుతుందంటూ పెట్రోల్ బాటిళ్లతో నిరసన తెలిపారు. అక్కడ ఉన్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి పెట్రోల్ బాటిళ్లు తీసుకున్నారు. తమ భూముల సమస్య పరిష్కరించాలని కోరుతూ రైతులు అడిషనల్ కలెక్టర్ రమేశ్‌కు వినతిపత్రం సమర్పించారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు.
వారం రోజుల్లో ఫిర్యాదులపై చర్యలు
సిద్ధిపేట రూరల్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఐడీఓసీ మీటింగ్ హల్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను తీసుకున్నారు. శాఖలవారీగా దరఖాస్తులను వారం రోజులల్లో పరిష్కరించి.. కలెక్టరేట్‌కు రిపోర్ట్ పంపాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 66 అర్జీలు వచ్చాయి.
మెదక్‌లో 21 ఆర్జీలు
మెదక్, వెలుగు: ప్రజావాణిలో వచ్చే ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ రమేశ్అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 21 ఆర్జీలు రాగా, అందులో 16 రెవెన్యూకు సంబంధించినవి ఉన్నాయి.
ఎస్పీ ఆఫీస్‌లో...
జిల్లా పోలీస్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ ఎస్పీ బాలస్వామి ఆర్జీలు స్వీకరించారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో తన భూమిలో గెట్టు మీదఉన్న చెట్లను నరికి, గెట్టును ట్రాక్టర్ తో దున్నేశారని,తనకు న్యాయం చేయాలని యాదయ్య అనే రైతు ఫిర్యాదు చేశారు. చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామం లోని తన 20 గుంటల భూమిలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి, బెదిరిస్తున్నారని బద్రియ తండాకి చెందిన బుజ్జి ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్సైలను ఏఎస్పీ
ఆదేశించారు.
తెలంగాణ ఉద్యమం యాదికొస్తుంది
కంగ్టి,వెలుగు : తడ్కల్ మండల సాధన కోసం చేస్తున్న ఆందోళన తెలంగాణ కోసం సబ్బండ చేసిన ఉద్యమాన్ని యాదికి తెస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జానవాడే సంగప్ప అన్నారు. సోమవారం సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సకల జనభేరి సభలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తడ్‌కల్ మండలాన్ని వెంటనే ప్రకటించాలని బీజేపీ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ ఆలే భాస్కర్ డిమాండ్ చేశారు. ఆయన ఆందోళనకు మద్దతు ప్రకటించారు. లేకపోతే బీజేపీ అధికారంలోకి రాగానే తడ్కల్ మండలాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక పార్టీ లీడర్లకు ధైర్యం ఉంటే పదవులకు రాజీనామా చేసి మండలం ఏర్పాటు సహకరించాలని వారు పేర్కొన్నారు. మండల ఏర్పాటు కోసం పోరాడి చరిత్రలో నిలుస్తారో లేక చరిత్ర హీనులవుతారో తేల్చుకోవాలని మాజీ ఎంపీ సురేశ్ కుమార్ శెట్కార్ అన్నారు. పీసీసీ మెంబర్ డా.పీ సంజీవ్ రెడ్డి, బీజేపీ సీనియర్ లీడర్ రవి గౌడ్, మాజీ ఎమ్మెల్యే లు విజయ్ పాల్ రెడ్డి, గంగారాం సంఘీభావం తెలిపారు.
ఏడేళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకు
మెదక్ (శివ్వంపేట), వెలుగు: 16 ఏళ్ల వయసులో తప్పిపోయి అనాథాశ్రమంలో ఉన్న ఓ యువకుడు ఏడేళ్ల తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు చేరాడు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బికుమాల గ్రామానికి చెందిన నిర్మలకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఆమె పెద్ద కొడుకు నరేశ్ ఏడేండ్ల కింద బోనాల పండుగకు హైదరాబాద్ లోని చుట్టాలింటికి వచ్చాడు. పండగ అయ్యాక ఇంటికి వెళ్తుండగా హైదరాబాదులో తప్పిపోయాడు. రోడ్ల మీద తిరుగుతున్న అతన్ని బాలల సంరక్షణ అధికారులు మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ముగ్దుంపూర్ బేతాని ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమ నిర్వాహకులు తల్లిదండ్రుల గురించి ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు. ఇటీవల అతని ఫొటోను ఇన్‌స్టా గ్రామ్ లో పెట్టగా , బికుమాల గ్రామస్తులు గుర్తుపట్టి అతని తల్లి నిర్మలకు చెప్పారు. దాంతో నిర్మల సోమవారం ఆశ్రమానికి వచ్చారు. నరేశ్ ఆమె కొడుకే అని నిర్ధారించుకున్న ఆశ్రమ నిర్వాహకులు సజీవ వర్గీస్ అతన్ని అప్పగించారు.
కేబుల్ గోతిలో పడి వ్యక్తి మృతి
కొహెడ(హుస్నాబాద్), వెలుగు: అక్కన్నపేట మండలం చౌటపల్లిలో కేబుల్ గుంతలో పడి ఆదివారం ఒక వ్యక్తి చనిపోయాడు. చౌటపల్లికి చెందిన గాజుల అశోక్(45) రాత్రి ఇంటికి వెళ్తుండగా మర్రికుంట కట్టపై కేబుల్ వైర్ల కోసం తవ్విన గోతిలో పడ్డాడు. ఎవరూ చూడక పోవడంతో అశోక్ అక్కడే మృతి చెందాడు. అక్కన్నపేట ఎస్ ఐ వివేక్ కేసు నమోదు చేసుకున్నారు.
హుస్నాబాద్ సీఐగా కిరణ్
హుస్నాబాద్ సీఐగా ఎర్రల కిరణ్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.ఇంతకు ముందు సీఐగా పని చేసిన రఘుపతిరెడ్డి సిద్దిపేట ఎస్బీకి బదిలయ్యారు. జగిత్యాల సీసీఎస్‌లో పని చేస్తున్న కిరణ్ఇక్కడ కు బదిలీపై వచ్చారు. ఏ సమస్య వచ్చిన నేరుగా తనను కలవాలని, శాంతిభద్రతలను కాపాడడంలో సహకరించాలని కిరణ్కోరారు.
అప్పుల తిప్పలు తప్పాయి
పాపన్న పేట (మెదక్) : రైతుబంధు వల్ల పంటలసాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన తిప్పలు తప్పాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. పాపన్న పేటలో వన దుర్గ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. ఎరువుల, విత్తన డీలర్లు రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్య క్రమం లో జెడ్పీటీసీ లావణ్య, ఏడుపాయల గుడి చైర్మెన్ బాలాగౌడ్, గోపాల్ రెడ్డి,సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు జగన్, తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మలు, బోనాలతో వీఆర్ఏల ర్యాలీ
మెదక్, వెలుగు: బతుకమ్మలు, బోనాలతో వీఆర్ఏలు సోమవారం మెదక్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాలనుంచి వీఆర్ఏలు ర్యాలీకి తరలివచ్చారు. పేస్కేల్ తదితర సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మలు, బోనాలు, పోతరాజుల వేషధారణలతో తహశీల్దార్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా జేఏసీ చైర్మన్ రాధాకృష్ణ, కోచైర్మన్ పెద్దులు, జనరల్ సెక్రెటరీ ఏసు, రాష్ట్ర నాయకులు వెంకటేష్ యాదవ్, వంగూరు రాములు పాల్గొన్నారు.
ఖేడ్ లో భిక్షాటన
నారాయణ్ ఖేడ్,వెలుగు: తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్న ఆగ్రహంతో సోమవారం వీఆర్ఏలు నారాయణ ఖేడ్ లో భిక్షాటన
చేశారు. ఆర్డీవో ఆఫీసు ముందు సమ్మె శిబిరం నుంచి బయలుదేరి పట్టణంలోని పలు షాపుల్లో, కూరగాయల మార్కెట్లో బిచ్చమెత్తారు. రాజీవ్ చౌక్‌లో నిరసన ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో ఆల గోన్లు బాలరాజ్, లక్ష్మయ్య, కేవయ్య తదితరులు పాల్గొన్నారు.
గోకుల్ వెంకటేశ్వర హాస్పిటల్ప్రారంభం
కంది, వెలుగు : సంగారెడ్డిలో గోకుల్ వెంకటేశ్వర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ను సోమవారం ఫైనాన్స్, హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు ప్రారంభించారు. హాస్పిటల్లో ప్రత్యేక పూజలు చేశారు. హాస్పిటల్లో ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, వైద్య పరికరాలను పరిశీలించారు. గోకుల్ హాస్పిటల్ ఎండీ, టీఆర్ఎస్ స్టేట్ లీడర్ డాక్టర్ శ్రీహరి తన కుటుంబ సభ్యులతో కలిసి హరీశ్‌కు శాలువా కప్పి సన్మానించారు. సంగారెడ్డిలో అత్యాధునిక సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని మంత్రి అన్నారు. సంగారెడ్డితో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలకు సేవలందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా
ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పురాతన ఆలయాల పునరుద్ధరణ భేష్
పటాన్చెరు,వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి, పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణకు కృషి చేయడం అభినందనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. పటాన్ చెరులోని పురాతనమైన శ్రీ మాణిక్ ప్రభు దేవాలయ జీర్ణోద్ధరణలో భాగంగా శ్రీ శివ పంచాయతన హనుమ, మాణిక్య ప్రభు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం జరగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మాణిక్ ప్రభు దేవాలయాన్ని రూ. 2కోట్ల 20 లక్షలతో పునరుద్దరణ చేస్తున్నట్టు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మంత్రికి తెలిపారు.
మహిళలకు ‘భరోసా
సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళలు, పిల్లల రక్షణ కోసం రాష్ట్రమంతటా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం సంగారెడ్డి లోని రామ్ నగర్ లో భరోసా సెంటర్ కొత్త భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. పోక్సో కేసుల్లో బాధితులకు, అత్యాచారాలకు గురైన మహిళలకు భరోసా కేంద్రాలద్వారా సాయమందిస్తామని ఎస్పీ రమణకుమార్ చెప్పారు. రాష్ట్రంలో భరోసా కేంద్రాలు మహిళలకు అండగా నిలబడుతున్నాయని కలెక్టర్ శరత్ తెలిపారు. భవన నిర్మాణానికి సహాయం చేసిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి లను అభినందించారు.