గరిడేపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ జడ్పీ హైస్కూల్‌ను మంగళవారం కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సందర్శించారు. స్కూల్‌లో ఎక్కడి చెత్త అక్కడే ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కనీసం స్కూల్‌ని క్లీన్ చేయించడం లేదా’ అని పంచాయతీ కార్యదర్శి, స్కూల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపేర్‌లో ఉన్న ఫాగింగ్ మిషన్‌ను త్వరగా రిపేర్ చేయించాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో ‘మన ఊరు మన బడి’ పనులు పూర్తి చేసి తర్వాత ఆ నిధులను సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. అలాగే అన్ని క్లాస్‌లు తిరుగుతూ టీచర్లు, స్టూడెంట్ల అటెండెన్స్‌ను పరిశీలించారు. అనంతరం పంచాయతీ ఆఫీస్‌లో రికార్డులను పరిశీలించి ఈజీఎస్, మల్టీపర్పస్ వర్కర్లు ఎంత మంది ఉన్నారో తెలుసుకున్నారు. అలాగే కీతవారిగూడెం అంగన్‌వాడీ 1 సెంటర్‌ను సందర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ కార్తీక్, ఎంపీడీవో వనజ, ఎంపీవో భద్రయ్య, సర్పంచ్‌లు ఆదూరి పద్మకోటయ్య, కీత జ్యోతి రామారావు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
ఆలేరు అభివృద్ధి కోసమే పాదయాత్ర
యాదాద్రి, వెలుగు : ఆలేరు అభివృద్ధి కోసమే పాదయాత్ర చేపట్టినట్టు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య చెప్పారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు, శారాజీపేట, కొల్లూరు, తూర్పుగూడెం, గొలనుకొండ, మందనపల్లి గ్రామాల్లో మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరికీ పింఛన్లు ఇస్తామన్న ప్రభుత్వం కొందరికే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల సామాన్యులు బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా లేవని వాగుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నా కల్వర్టులను నిర్మించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆలేరులో కాంగ్రెస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్‌ఎస్ గెలిచాకే మునుగోడు అభివృద్ధి
చండూరు/మునుగోడు, వెలుగు : టీఆర్‌ఎస్ గెలిచిన తర్వాతే మునుగోడు అభివృద్ధి జరిగిందని, ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లా మర్రిగూడ, గట్టుప్పల్, మునుగోడులో నిర్వహించిన మీటింగ్‌లలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చూసి ఓర్వలేకే అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి ఓటు వేస్తే మోటార్లకు మీటర్లు తప్పవన్నారు. నిరంతర విద్యుత్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టోలో లేని పథకాలను సైతం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేస్తే ఎలాంటి ఫలితం ఉండదన్నారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. బీజేపీ పాలనలో గ్యాస్, పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయన్నారు. ప్రతి కార్యకర్త గడపగడపకు తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నాయకులు నారబోయిన రవి, కర్నాటి స్వామి యాదవ్, బండ పురుషోత్తంరెడ్డి, కర్నాటి వెంకటేశం, గుర్రం వెంకట్‌రెడ్డి, అవ్వారి గీత శ్రీనివాస్ పాల్గొన్నారు.
మాస్టర్‌ప్లాన్ కోసం వివరాలివ్వండి
యాదాద్రి, వెలుగు : వచ్చే 20 ఏండ్లలో మున్సిపాలిటీల్లో ఎలాంటి సౌకర్యాలు అవసరం అవుతాయన్న విషయాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని యాదాద్రి అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. ఈ వివరాల ఆధారంగానే మాస్టర్‌ప్లాన్ రెడీ అవుతుందన్నారు. మోత్కూరు, ఆలేరు మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్ కోసం మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, ఫ్యామిలీ వెల్ఫేర్, పొల్యూషన్, రోడ్లు, ప్లానింగ్, మైనింగ్, పోలీస్ డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నర్సింహారెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సత్యభామ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సమావేశంలో సీపీవో భుక్యా మాన్యానాయక్, ఆర్‌అండ్‌బీ ఏఈ శంకరయ్య, మోత్కూరు, ఆలేరు మున్సిపల్ కమిషనర్లు శ్రీకాంత్, మారుతీప్రసాద్ పాల్గొన్నారు.
మునుగోడులో గెలిచేది టీఆర్‌ఎస్సే...
మునుగోడు, వెలుగు : మునుగోడులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది టీఆర్‌ఎస్సేనని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మునుగోడులో మంగళవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నిత్యావసర ధరలను పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే తెలంగాణలో 35 లక్షల మంది రైతులపై ఎఫెక్ట్ పడుతుందన్నారు. మునుగోడులో 40 వేల మందికి పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌కే మునుగోడులో ఓటు అడిగే హక్కు ఉందన్నారు. సమావేశంలో మండల అధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, ఎంపీటీసీలు బొడ్డు శ్రావణి నాగరాజుగౌడ్, ఈద నిర్మల శరత్ పాల్గొన్నారు.
సిబ్బంది కొరత లేకుండా చూస్తాం
దేవరకొండ, వెలుగు : పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత లేకుండా చూస్తామని నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి చెప్పారు. దేవరకొండ, చందంపేట, నేరేడుగొమ్ము పోలీస్ స్టేషన్లను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం దేవరకొండ పోలీస్ స్టేషన్‌ను, క్వార్టర్స్‌ను పరిశీలించి మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాల విభజన తర్వాత కొన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు. త్వరలో 18 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్న నేపథ్యంలో సిబ్బంది కొరత తీరే అవకాశం ఉందన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్‌లు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. ఆకతాయిలు, మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐలు శ్రీనివాసులు, పందిరి పరుశురాం
పాల్గొన్నారు.
గీతన్న బంధు అమలు చేయాలి
యాదగిరిగుట్ట, వెలుగు : గీత కార్మికుల కోసం ‘గీతన్న బంధు’ పథకాన్ని, ‘గీతన్న బీమా’ను అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూడిద గోపి గౌడ్ డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన కల్లుగీత కార్మిక సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్ 19, 20 తేదీల్లో యాదగిరిగుట్టలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గీతకార్మిక సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలని, 560 జీవోనుఅమలు చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన గీతకార్మికులకు పింఛన్ ఇవ్వాలని, గౌడ్స్‌కు ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని కోరారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు.