నాల్గవ ఎస్టేట్ గా పేర్కొనబడుతున్న పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి మూలాధారంలో ఒకటి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి ఆచరించే విధానాల గురించి ప్రజలకు తెలియజేసేవి పత్రికలు, అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల స్పందన ప్రభుత్వానికి అందించే ముఖ్యమైన సాధనాలు కూడా పత్రికలే. కావున పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాయి. పత్రికల ద్వారా ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి సమర్థవంతమైన పరిపాలన అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకే అమెరికాలాంటి ప్రజాస్వామ్య సమాజంలో పత్రికలను ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా, ప్రజాకోర్టుగా పేర్కొంటారు. ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య సమాజంలోనైనా పత్రికలు ఈ కింది విధులను నిర్వహిస్తాయి.
ముఖ్యంగా అవి సమాజంలో జరుగుతున్న సంఘటనల పరిణామాల తాలూకు సమగ్ర సమాచారాన్ని పౌరులకు అందజేయడం. వాటి ప్రాధాన్యతను పత్రికలు విశ్లేషించాలి లేదా వాటికి భాష్యం చెప్పాలి. సంపాదకీయాలు, వ్యాసాలు ప్రచురించాలి. మనకు వర్తమానంలో అందిన సామాజిక వారసత్వాన్ని రానున్న తరాలవారికి అందజేయాలి. అదేవిధంగా వినోదాన్ని కలిగిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించాలి. కావున పత్రికల యొక్క సామాజిక బాధ్యత అసమానమైనది. మరి అంత గొప్ప సామాజిక బాధ్యత నిర్వర్తించడానికి పత్రికలకు స్వేచ్ఛ అత్యవసరం. పత్రికలకు స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజల సాధకబాధకాలు తెలపడంతో పాటు ప్రభుత్వం పని విధానాన్ని సమీక్షించడానికి వీలవుతుంది. అపుడే సమర్థవంతమైన పరిపాలనకు ఆస్కారం ఉంటుంది.
పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో..
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ఇండెక్స్..పత్రికా స్వేచ్ఛ సూచికలో గత ఏడాది142వ స్థానంలో ఉన్న భారత్ మరింత దిగజారి150వ స్థానానికి పడిపోయిందని తెలిపింది. భారత్‌లో లక్షకుపైగా వార్తా పత్రికలతో పాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్ చానళ్లు ఉన్నాయని నివేదికలో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా180 దేశాలు, ప్రాంతాల్లో పత్రికా స్వేచ్ఛ తీరుతెన్నులను తెలిపే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్–2022 ప్యారిస్‌లోని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ విడుదల చేసింది.ఈ సూచీలో నార్వే, డెన్మార్క్, స్వీడన్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. చివరి(180వ) స్థానంలో నార్త్ కొరియా ఉంది. ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న తీవ్రవాదం, రాజకీయ ఒత్తిళ్ళు, కుల,మత విద్వేషాలు పెరగడం, జర్నలిస్టులపై దాడులతో పాటు పలు సంక్షోభాలు పత్రికా స్వేచ్ఛకు ఆటంకంగా మారాయి. వీటిని అధిగమించడానికి ప్రపంచస్థాయిలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రభుత్వాలు పత్రికలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
భారతదేశంలో పత్రికల పాత్ర పరిశీలిస్తే.. స్వాతంత్రోద్యమ కాలం నుంచి నేటి వరకు ప్రజలను చైతన్యం చేసే ముఖ్య సాధనాలుగా పత్రికలు వ్యవహరిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ విషయంలో భారత రాజ్యాంగంలో ఎక్కడా అధికారికంగా ప్రస్తావించలేదు, కానీ రాజ్యాంగంలోని అధికరణ19A(1) ప్రకారం పౌరులందరికీ కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పత్రికా స్వేచ్ఛను పేర్కొంటారు. ఈ విషయాన్ని రాజ్యాంగం అమలులోకి వచ్చిన కొత్తలో ‘క్రాస్ రోడ్స్’ అనే వారపత్రిక పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భావప్రకటన స్వేచ్ఛనే పత్రికా స్వేచ్ఛగా నిర్వచించినది. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 1975–-77 నాటి ఎమర్జెన్సీ పత్రికాస్వేచ్చకు చీకటి రోజులని పేర్కొనవచ్చు. పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి నవంబర్16,1966లో ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ ను ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఈ కౌన్సిల్ ను 1978లో చట్టంగా మార్చి పత్రికా స్వేచ్చను కాపాడే ప్రయత్నం చేయడం జరిగినది. భారత దేశంలో ప్రతి ఏటా నవంబర్16న జాతీయ ప్రెస్ దినోత్సవం జరుపుకోవడం కూడా జరుగుతుంది.
పత్రికలు పాలకులకు వంత పాడటం పెరిగింది
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వాల కనుసన్నల్లో నడిచే పత్రికల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ, పేదల వార్తలను విస్మరిస్తూ, పాలకులకు అనుగుణమైన వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విలువలకు తిలోదకాలిస్తూ ప్రభుత్వ విధానాలను ఢంకా మోగించే కరపత్రాలుగా పత్రికలు మారుతున్నాయానే ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో స్వేచ్ఛ పేరుతో పత్రికలు వాస్తవాలను కూడా వక్రీకరించడం జరుగుతుంది. కావున వాటిని నిరోధించడానికి వివిధ చట్టాల పరిమితులున్నాయి. వాటినిగుర్తెరిగి పత్రికలు నడుచుకోవాలి. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పత్రికా రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దానికి ముఖ్యకారణం ఇంటర్నెట్, సామాజిక మాద్యమాల విస్తృతి పెరగడమే అని పేర్కొంటున్నారు. కావున ప్రజాభిప్రాయాన్ని సరిగా ప్రతిబింబించే పత్రికలు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి. ప్రజాస్వామ్య వికాసానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో పత్రిక స్వేచ్ఛ వర్ధిల్లడానికి ప్రజాస్వామ్యమూ అంతే అవసరం. పత్రికా స్వేచ్ఛను కాపాడే ప్రయత్నం అందరూ చేయాలి.
ప్రజలను చైతన్యం చేసేది పత్రికలే
ప్రజల పక్షాన ప్రత్యామ్నాయ శక్తిగా పనిచేస్తున్న పత్రికలు చారిత్రకంగా అనేక సాధక బాధకాల మధ్య తన సామాజిక బాధ్యతను నెరవేరుస్తూ ప్రజా చైతన్యానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పత్రికలు బాధ్యతాయుతంగా మెదులుతూ, విశ్వసనీయతను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెజార్టీ ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేయాలి. భాగస్వామ్య పార్టీల ఒత్తిళ్లతో, ప్రతిపక్షాల ఎత్తుగడలతో సతమవుతున్న ప్రభుత్వాలకు మన పత్రికలు‘ఏజెండా’ తయారుచేసి సమర్పించే విధంగా ఉండాలి. పేదల కష్టాలను, నిరుద్యోగుల వెతలను, అధికారుల అవినీతిని ప్రభుత్వాల ముందు ఉంచాలి. దేశంలోని క్షేత్రస్థాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా పత్రికలు వ్యవహరించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ సంక్షోభాన్ని ప్రజలకు అవగాహన కలిగించి, ప్రభుత్వాలు వాటిని పరిష్కరించే దిశగా కృషిచేయాలి.
- సంపతి రమేశ్ మహారాజ్, సోషల్ అనలిస్ట్