పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి మూలస్తంభం లాంటివి. అందుకే పత్రికలను ఫోర్త్ ఎస్టేట్‌లో భాగంగా పేర్కొంటారు. ఇవి ప్రభుత్వ నిర్ణయాలు, పరిపాలన విధానాల గురించి ప్రజలకు తెలియజేస్తాయి. అదేవిధంగా వాటి పట్ల ప్రజల స్పందనను ప్రభుత్వానికి అందిస్తాయి. అంటే.. పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాయి. ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి సమర్థవంతమైన పరిపాలన అందించడానికి తోడ్పడతాయి. అందుకే అమెరికాలాంటి ప్రజాస్వామ్య సమాజంలోనూ పత్రికలను ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా, ప్రజా కోర్టుగా పేర్కొంటారు.
ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సమాజంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాల సమగ్ర సమాచారాన్ని పౌరులకు పత్రికలే అందజేస్తాయి. ఆ సమాచారం ప్రాధాన్యతను విశ్లేషించి వాటికి భాష్యం చెప్పాలి. సంపాదకీయాలు, వ్యాసాలు పత్రికలే ప్రచురించాలి. వర్తమానంలో అందిన సామాజిక వారసత్వాన్ని రానున్న తరాలవారికి అందజేయాలి. వినోదాన్ని కలిగిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించడం పత్రికల సామాజిక బాధ్యతగానే పరిగణించాలి. దీనికి పత్రికలకు స్వేచ్ఛ కూడా అత్యవసరం. భారతదేశంలో పత్రికల పాత్ర పరిశీలిస్తే.. స్వాతంత్ర్యోద్యమ కాలం నుంచి నేటి వరకూ ప్రజలను చైతన్యం చేసే ముఖ్య సాధనాలు పత్రికలే.
భారత్@161 ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో పత్రికా స్వేచ్ఛ
తీరుతెన్నులను తెలిపే వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్ ను ప్యారిస్‌లోని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ.. ప్రతి ఏటా అంతర్జాతీయ పత్రికా దినోత్సవం రోజైన మే 3వ తేదీన విడుదల చేస్తోంది. ఈ ఏడాది పత్రికా స్వేచ్ఛ సూచీలో 180 దేశాలకుగాను భారత్ 161వ స్థానంలో నిలిచింది. గతేడాది 150వ స్థానంలో ఉన్న భారత్ 11 స్థానాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. మన పక్కన ఉన్న భూటాన్ (90) , శ్రీలంక(135), పాకిస్తాన్(150), అఫ్గనిస్తాన్(152) మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. అంతేకాకుండా 2016 నుంచి భారత్ స్థానం దిగజారుతూనే ఉందని ఈ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ సూచీలో నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండగా... వియత్నాం, చైనా, నార్త్ కొరియా చివరి స్థానంలో నిలిచాయి.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో పడిందని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వ్యాఖ్యానించింది. ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న తీవ్రవాదం, రాజకీయ ఒత్తిళ్లు, కుల, మత విద్వేషాలు పెరగడం, జర్నలిస్టులపై దాడులతోపాటు పలు సంక్షోభాలు పత్రికా స్వేచ్ఛకు ఆటంకంగా మారాయి. వీటిని అధిగమించడానికి ప్రపంచస్థాయిలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజాసంఘాలు, ప్రభుత్వాలు పత్రికలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది.
ప్రజా చైతన్యానికి పెద్ద పీట
పత్రికలు ప్రజా చైతన్యానికి పెద్ద పీట వేసి, అనేక అవాంతరాలను ఎదుర్కొంటూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పత్రికలు మరింత బాధ్యతగా, విశ్వసనీయతను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పత్రికలు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కాగా, భాగస్వామ్య పార్టీల ఒత్తిళ్లతో, ప్రతిపక్షాల ఎత్తుగడలతో సతమతవుతున్న నేటి ప్రభుత్వాలకు మన పత్రికలు ‘ఎజెండా’ తయారుచేసి సమర్పించేవిధంగా ఉండాలి. పేదల కష్టాలను, నిరుద్యోగుల వెతలను, అధికారుల అవినీతిని ఎండగట్టి ప్రజలు, ప్రభుత్వాల ముందు ఉంచాలి. దేశంలోని క్షేత్రస్థాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా పత్రికలు వ్యవహరించాలి.
పత్రికలదే కీలక పాత్ర
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వాల కనుసన్నల్లో నడిచే పత్రికల సంఖ్య ఇటీవల రోజు రోజుకూ పెరుగుతోంది. పేదలను విస్మరిస్తూ ధనికుల వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విలువలకు తిలోదకాలిస్తూ ప్రభుత్వ విధానాలను ఢంకా మోగించే కరపత్రాలుగా పత్రికలు మారుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. కొన్ని సందర్భాలలో స్వేచ్ఛ పేరుతో పత్రికలు వాస్తవాలను కూడా వక్రీకరించడం జరుగుతోంది.
నైతిక విలువగుర్తెరిగి బాధ్యతాయుతంగా పత్రికలు నడుచుకోవాలి. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పత్రికా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దానికి ముఖ్య కారణం ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల విస్తృతి పెరగడమే అని పేర్కొంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే పత్రికలకు ప్రజలు ఎప్పుడూ చేయూతగా ఉంటారు. ప్రజాస్వామ్య వికాసంలో పత్రికా స్వేచ్ఛ ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. పత్రికా స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల స్వేచ్ఛను హరించడమే అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి.
భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమే పత్రికలు
పత్రికా స్వేచ్ఛ విషయంలో భారత రాజ్యాంగంలో అధికారికంగా ప్రస్తావించకపోయినప్పటికీ.. రాజ్యాంగంలోని అధికరణ19A(1) ప్రకారం పౌరులందరికీ కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే పత్రికలను పేర్కొంటారు. ఈ విషయాన్ని రాజ్యాంగం అమలులోకి వచ్చిన కొత్తలో "క్రాస్ రోడ్స్" అనే వారపత్రికపై ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు నిర్వచించినది. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 1975-–77 నాటి ఎమర్జెన్సీ కాలం పత్రికా స్వేచ్ఛకు చీకటి రోజులని పేర్కొనవచ్చు.
భారత్‌లో పత్రికా స్వేచ్ఛను కాపాడడానికి 16 నవంబర్ 1966లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అనంతరం ఈ కౌన్సిల్ ను 1978లో చట్టంగా మార్చి పత్రికా స్వేచ్ఛను కాపాడే ప్రయత్నం చేశారు. ప్రతి ఏటా నవంబర్ 16న జాతీయ ప్రెస్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నది.
- సంపతి రమేశ్ మహరాజ్,సామాజిక విశ్లేషకులు