హైదరాబాద్, వెలుగు: రానున్న 11 రోజులు కీలకమని, ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మంత్రులు, లోక్ సభ నియోజకవర్గాల ఇన్చార్జ్లు, ఎంపీ అభ్యర్థులతో ఆయన సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ల స్క్రూటినీ పూర్తయిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘‘వచ్చే11 రోజులు కీలకం. గాంధీ భవన్ తో ఎప్పటికప్పుడు కో- ఆర్డినేట్ చేసుకోవాలి. ప్రణాళికతో ప్రచారం నిర్వహించాలి.
ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పని చేయాలి. ప్రతి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ చార్జులపై ఉంది. నాలుగు నెలల్లో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, పేదలకు చేకూరుతున్న లబ్ధి, ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి” అని దిశానిర్దేశం చేశారు. ఎవరికి కేటాయించిన బాధ్యతలను వారు కచ్చితంగా నిర్వహించాలని, కష్టపడి పనిచేసినోళ్లకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం నిర్వహించాలనుకునేవారు వీలైనంత త్వరగా వివరాలు ఇచ్చి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. పార్టీ ఆర్గనైజేషన్ కు సంబంధించి సమస్యలుంటే స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, ఇన్చార్జ్ సెక్రటరీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు.