
- కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు
- ఎమర్జెన్సీ కోసం 08744241950
- వరద ఇబ్బందులుంటే వాట్సప్ నెంబర్ 93929 19743
- కొత్తగూడెంలోని ఆర్డీఓ ఆఫీస్‌లో 93929 19750
- భద్రాచలం ఆర్డీఓ ఆఫీస్‌లో 08743 232444
భద్రాచలం,వెలుగు: రాబోయే 72 గంటలు ఎంతో కీలకమని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక అలా సూచించారు. భద్రాచలం ఆర్డీవో ఆఫీసులో జిల్లా స్థాయి ఆఫీసర్లతో బుధవారం సాయంత్రం భారీ వర్షాలు, గోదావరి వరద పెరుగుదల, ముందస్తు జాగ్రత్తలపై రివ్యూ మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే 72 గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని,అందుకే రెడ్అలర్ట్ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల ఆఫీసర్లకు సెలవులు రద్దు చేశామ ని, అనుమతి లేకుండా జిల్లాను దాటి వెళ్లొద్దని ఆదేశించారు. వరద ముంపు ఉన్న 7 మండలాలలో సెక్టోరల్ ఆఫీసర్లను నియమించామని, కంట్రోల్ రూంలు మండలాలతో పాటు భద్రాచలం, కొత్తగూడెంలలో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
అంతకు ముందు చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఆమె పర్యటించారు. చర్లలోని దండుపేట, దండుపేట కాలనీ, కొత్తపల్లి, లింగాపురం, గొంపల్లి, వీరాపురం, జీపీపల్లి, సుబ్బంపేట గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వరద పెరిగితే పునరావాస కేంద్రాలకు తరలిపోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భద్రాచలంలోని నన్నపునేని మోహన్హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. గోదావరి కరకట్ట విస్తా కాంప్లెక్స్ స్లూయిజ్‌లను పరిశీలించి, మురుగునీటిని ఎత్తిపోసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. మోటార్లు, స్లూయిజ్ల పరిస్థితిని తెలుసుకున్నారు. వాగులు, నదులలో పడవ ప్రయాణాలు నిషేధించాలని, పోలీసులు,ఇరిగేషన్ ఇంజనీర్లు పర్యవేక్షించాలని, రెవిన్యూ స్టాఫ్ ముంపు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఆర్డీవో రత్న కల్యాణి, ఏఎస్పీ పంకజ్ఆమె వెంట ఉన్నారు.
ఏకధాటిగా కురుస్తున్న వాన..
నిరంతరాయంగా కురుస్తున్న వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు దుమ్ముగూడెంలో 165.4, మణుగూరులో 143.6ఎం.ఎం,అశ్వాపురంలో 122.8, చర్లలో 91.4, పినపాకలో 89.4, కరకగూడెంలో 57.0, భద్రాచలంలో 53.6, ఆళ్లపల్లిలో 52.2, బూర్గంపహడ్‌లో 45.6, అన్నపురెడ్డిపల్లిలో 43.4, ఎంఎం వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 1,184.4ఎంఎం వాన కురిసింది. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లోని ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్టులలో ఓవర్ బర్డెన్(మట్టిపనులు) తీసే పనులకు ఆటంకం కలిగింది. ఏజెన్సీలోని పలు వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని నదికి 700క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. తాలిపేరు ప్రాజెక్ట్‌కు చెందిన 22గేట్లు ఎత్తి 49వేల క్యూసెక్కులకు పైగా వరదనీటిని దిగువకు వదులుతున్నారు. గుండాల మండలంలోని గుండాల, కొడవటంచ గ్రామాల మధ్యలో గల ఏడుమెలికల వాగు, కిన్నెరసాని కలిసే చోట చప్టాపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.
మణుగూరులో లోతట్టు ప్రాంతాలు జలమయం
మణుగూరు, వెలుగు: జోరు వానతో మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్, ఆదర్శనగర్ ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి వచ్చి ఇళ్లలోకి చేరింది. తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలను పినపాక ఎమ్మెల్యే విప్ రేగా కాంతారావు పరిశీలించారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
కిన్నెరసానిలోకి స్వల్పంగా వరదనీరు
పాల్వంచ రూరల్, వెలుగు: భారీ వర్షానికి పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి స్వల్పంగా వరదనీరు చేరుతోంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 407అడుగులు ఉండగా బుధవారం 397.90అడుగుల వద్ద నిలకడగా వుంది. రిజర్వాయర్‌లోకి 700క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు డ్యాంసైట్ అధికారులు తెలిపారు.
బేతుపల్లికి పోటెత్తుతున్న వరద నీరు
సత్తుపల్లి, వెలుగు: విస్తరంగా కురుస్తున్న వర్షాలతో సత్తుపల్లిలోని బేతుపల్లి జలాశయంలో15 అడుగులకు నీరు చేరింది. దీని పూర్తి సామర్థ్యం 16 అడుగులు. వర్షాల కారణంగా జేవీఆర్. ఓపెన్ కాస్ట్, కిష్టారం ఓసీలలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దీంతో 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులతో పాటు సుమారు 30 వేల టన్నుల బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. సింగరేణికి సుమారు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
పొంగి పొర్లుతున్న వాగులు..
గుండాల, వెలుగు: గుండాల, ఆళ్లపల్లి మండలా ల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జల మాయమయ్యాయి. గుండాల, కొడవటంచ మధ్య కిన్నెరసాని బ్రిడ్జి పైనుంచి వాగు పొంగి ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చిన కోడవటంచ, పాలగూడెం, నాగారం వివిధ గ్రామాల వారు గంటల తరబడి వాగుల వద్ద నిలిచిపోయారు. ఉధృతి తగ్గిన తర్వాత జనం వాగు దాటారు.
అశ్వాపురం అతలాకుతలం
అశ్వాపురం వెలుగు: భారీ వర్షాలతో మండలం అతలాకుతలమైంది. గొంది గూడెం గ్రామం వద్ద ఇసుక వాగు లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు పొంగి పొరలడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఇండ్లలో వరద నీరు చేరింది. తుమ్మల చెరువులోకి పది అడుగుల నీరు చేరింది. కొన్నిచోట్ల నారు మడులు మునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కంది, మొక్కజొన్న, పత్తి తదితర పంటలకు నష్టం వాటిల్లింది.
ఆఫీసర్లంతా క్షేత్రస్థాయిలో ఉండాలి : కలెక్టర్
గోదావరికి వరద నీరు భారీగా చేరుతున్న క్రమంలో జిల్లా స్థాయి ఆఫీసర్లంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. ఎగువనున్న కాళేశ్వరం, ఇంద్రావతి, తాలిపేరు నదుల నుంచి వచ్చే నీటితో గోదావరికి వరద పోటెత్తుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 2.35లక్షలు, ఇంద్రావతి నది నుంచి 2.15లక్షలు, తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి 60వేల క్యూసెక్కుల వరద నీరు గోదావరికి వస్తుందన్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి వరకు భద్రాచలం వద్ద గోదావరి 35 అడుగుల వరకు చేరే అవకాశం ఉందన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలన్నారు. వరదలు, వర్షాల నేపథ్యంలో పశువులను బయటకు పంపవద్దని సూచించారు.
అత్యవసర సేవల కోసం కలెక్టరేట్లో 08744241950 నంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు వరద, వానలతో ఇబ్బందులుంటే వాట్సప్ నెంబర్ 9392919743కు సమాచారం ఇవ్వాలన్నారు. కొత్తగూడెంలోని ఆర్డీఓ ఆఫీస్‌లో 9392919750, భద్రాచలం ఆర్డీఓ ఆఫీస్‌లో 08743232444నెంబర్లకు వరద సమాచారం ఇవ్వాలన్నారు. ఈ ఫోన్ నెంబర్లు 24గంటలు పనిచేస్తాయన్నారు. అత్యవసర సేవలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు.