
- ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్ పూర్తి చేసిన టీఏఎఫ్ఆర్సీ
- భారీగా ఫీజులు పెంచాలని బడా కాలేజీల ప్రపోజల్స్
- పెంపునకు హియరింగ్ లోనే పలు కాలేజీలకు కమిటీ హామీ
- త్వరలో టీఏఎఫ్ఆర్సీ మీటింగ్.. ఆ తర్వాత సర్కార్‌కు ప్రతిపాదనలు
- ఆందోళనలో పేరెంట్స్, స్టూడెంట్లు
హైదరాబాద్. వెలుగు: త్వరలోనే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల బాంబు పేలనున్నది. వచ్చే ఏడాది బీటెక్ కోర్సుల్లో ఏకంగా 20 నుంచి 50 శాతం దాకా ఫీజులు పెరిగే అవకాశం ఉన్నది. పలు కాలేజీల్లో ఫీజులు ఏకంగా రూ.2 లక్షలు దాటనున్నట్టు తెలుస్తున్న ది. వచ్చేమూడేండ్లకుగాను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీవీ ఎఫ్ఆర్సీ) కసరత్తు చేస్తున్నది.
చివరిసారిగా 2022లో ఫీజులను నిర్ణయించగా, ఆ గడువు ఈ విద్యాసంవత్సరంతో ముగియనున్నది. దీంతో వచ్చే విద్యాసంవత్సరం (2025-26) నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. ఈ నేప థ్యంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 163 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్ మెట్ల హియరింగ్ ప్రక్రియను టీఏఎప్ఆర్సీ పూర్తి చేసింది. ఆయా కాలేజీలకు సంబంధించి 2022-23, 2023-24 సంవత్సరాల ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్టులు, అడ్మిషన్ల వివరాలను సేకరించింది. అదే సమయంలో ఎంత మేర ఫీజు పెంచాలని కోరుతున్నారనే ప్రతిపాదనలనూ స్వీకరించింది.. అయితే హియరింగ్ టైమ్‌లోనే కొన్ని కాలేజీల కు ఫీజుల పెంపుపై కమిటీ హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.
నాలుగైదు కాలేజీల్లో రూ.2 లక్షలు, ఆపై ఫీజులు ఖరారు చేసేందుకు మేనేజ్ మెంట్లకు టీఏ ఎఫ్ఆర్సీ హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది. దీంట్లో అత్యధికంగా సీబీఐటీ, వీఎస్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీల్లో ఏకంగా రూ.2.20 లక్షల దాకా ఫీజు పెంచేందుకు చాన్స్ ఇస్తున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులకు సర్కార్ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. దీనికోసం టీఏఎఫ్ఆర్సీ కమిటీ సమావేశం కావాల్సి ఉంది. ఒకటి, రెండు సార్లు సమావేశమయ్యాకే ఫైనల్ ఫీజులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని టీఏఎస్ఆర్సీ అధికారులు చెబుతున్నా రు. ఆ తర్వాతే సర్కారుకు ఫీజుల ప్రతిపాదనలు పంపించనున్నట్టు వెల్లడించారు. వచ్చేనెలలో ఈ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.
పెంచొద్దంటున్న స్టూడెంట్లు..
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు అంశం ఇటు పేరెంట్స్, అటు స్టూడెంట్లలో ఆందోళన కలిగిస్తున్నది. కాలేజీల్లో సరైన వసతులు లేకున్నా మేనేజ్ మెంట్లు టీఏఎఫ్ఆర్సీకి తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్టు స్టూడెంట్ యూనియన్ నేతలు చెబుతున్నారు. సరైన ఫ్యాకల్టీ లేరనీ, ఫ్యాకల్టీకి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ జీతాలు ఇస్తున్నట్టు నివేదికలు ఇచ్చి.. ఎక్కువ ఫీజుల కోసం ప్రతిపాదనలు పెట్టాయని ఆరోపిస్తున్నారు. గతేడాది ఫీజులే కొన్ని కాలేజీల్లో ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని.. మిగిలిన కాలేజీల్లో పాత ఫీజులే అమలు చేయాలని కోరుతున్నారు.