- భారీ పెట్టుబడులకు ఆరమ్ ఈక్విటీ పార్ట్నర్స్రెడీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఆరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో దాదాపు రూ.3,350 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. హైదరాబాద్‌లో నెక్ట్స్-జనరేషన్, ఏఐ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మించనున్నట్టు ప్రకటించింది. దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుతో ఆ సంస్థ సీఈవో, చైర్మన్ వెంకట్ బుస్సా సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలతోపాటు భారీ పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది.
సీఎం రేవంత్ హర్షం
హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం సంతోషకరమని చెప్పారు. దీంతో రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఆరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థ కొత్త డేటా సెంటర్ ఏర్పాటును మంత్రి శ్రీధర్‌బాబు స్వాగతించారు. ఇప్పటికే డేటా సెంటర్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ కు ఈ పెట్టుబడులు మరింత వృద్ధిని తెచ్చిపెడుతాయని అన్నారు.
తమ సంస్థ నెలకొల్పే అధునాతన డేటా సెంటర్‌తో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ సేవల మధ్య అంతరం తగ్గుతుందని ఆరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సీఈవో, చైర్మన్ వెంకట్ బుస్సా అన్నారు. ఈ-సేవ, ఈ- పేమెంట్, ఈ -ఎడ్యుకేషన్ వంటి ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇదిలా ఉంటే సీఎం అమెరికా పర్యటనకు భారీగా స్పందన లభించింది.
ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే 11 కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పలు సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు, వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించాయి.