సూర్యాపేట వెలుగు : సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం నాసిరకంగా ఉంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెలలో సప్లై చేసిన బియ్యం ఎర్ర రంగులో వచ్చాయని, ముక్క వాసన వస్తున్నాయని లబ్ధిదారులు మండిపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే రకమైన రైస్సప్లై అయినట్లు సమాచారం. ప్రధానంగా రేషన్ షాపులకు పోర్టిఫైడ్ బియ్యం సప్లై చేయాల్సి ఉన్నప్పటికీ స్టాక్ ఉందన్న కారణంగా నాన్ ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేశారు.
జిల్లాలో 610 రేషన్ షాపులు
సూర్యాపేట జిల్లాలో 610 రేషన్ షాపులు ఉండగా మనిషికి ఆరు కిలోల చొప్పున ఫ్రీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 9767.686మెట్రిక్ టన్నుల బియ్యం అలాట్ చేసింది. జిల్లాలోని అన్ని రేషన్ షాపులలో బియ్యం పంపిణీ ప్రారంభించారు. అయితే జిల్లాలో బియ్యం స్టాక్ ఉన్నాయన్న సాకుతో నాన్ ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా చేశారు. జిల్లాలోని గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్‌నగర్, పెన్ పహాడ్ మండలాల్లో ఇదే రకమైన బియ్యం సప్లై అయ్యాయి. అయితే ఈ రైస్ తిరుమలగిరి మండలంలోని ఓ రైస్ మిల్ నుంచి సప్లై చేసినట్లు తెలుస్తోంది.
సీఎమ్మార్లోటు పూడ్చేందుకు
రైతుల నుంచి కొనుగోలు చేసిన సీఎమ్మార్బియ్యాన్ని మిల్లర్లు మాయం చేయడంతో ఆ లోటు పూడ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆ బియ్యం క్వాలిటీ లేకపోవడంతో ఎఫ్‌సీఐ రిజెక్ట్ చేస్తుండడంతో కొంతమంది మిల్లర్లు వాటిని సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా రేషన్ షాపులకు, సంక్షేమ హాస్టళ్లకు సప్లై చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అందించాల్సిన ఫోర్టిఫైడ్ కాకుండా నాన్ ఫోర్టిఫైడ్ రైస్ సప్లై చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత జరుగుతున్నా ఆఫీసర్లు తనిఖీలు చేయకపోవడం గమనార్హం. మరోవైపు పాత గోనె సంచులలో సప్లై చేయడం వల్ల రైస్‌లో రాళ్లు, దుమ్ము చేరుతోందని, దిగుమతి సమయంలో రంగు మారుతోందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ముక్క వాసన వస్తున్నాయి
హుజూర్ నగర్‌లోని ఓ రేషన్ షాపులో ఈ నెల బియ్యం తీసుకున్నాం. బియ్యం ముక్క వాసన వస్తుండడంతో ఈ వాటిని ఎలా వండుకొని తింటామని అడిగితే ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకు మొత్తం ఇలానే ఉందని డీలర్చెబుతున్నాడు.
- దగ్గుపాటి బాబూరావు, హుజూర్ నగర్
స్టాక్ రీప్లేస్ చేస్తున్నాం
గతంలో మిగిలిపోయిన బియ్యంలో కొత్త స్టాక్ కలుస్తుండడంతో బియ్యం రంగు మారి ముక్క పురుగు వస్తోంది. లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో వాటి స్థానంలో కొత్త బియ్యం రీప్లేస్ చేస్తున్నాం.
- రాజశేఖర్, డీటీసీఎస్, హుజూర్ నగర్