వివాహేతర సంబంధం బయటపెట్టి..  సస్పెండ్‌‌ చేయించాడని హత్య

వివాహేతర సంబంధం బయటపెట్టి..  సస్పెండ్‌‌ చేయించాడని హత్య
  •  హనుమకొండ జిల్లాలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు సాయిప్రకాశ్‌‌ మర్డర్‌‌
  • ఈ నెల 15న హత్య చేసిన కానిస్టేబుల్‌‌, మరో నలుగురు వ్యక్తులు
  • పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు డెడ్‌‌బాడీ, కారు, సెల్‌‌ను వేర్వేరు చోట్ల వదిలిన నిందితులు
  • మహిళతో పాటు ఆరుగురిని అరెస్ట్‌‌ చేసిన పోలీసులు

హనుమకొండ, వెలుగు : వివాహేతర సంబంధాన్ని బయటపెట్టి, విధుల నుంచి సస్పెండ్‌‌ చేయించాడన్న కోపంతో ఓ కానిస్టేబుల్‌‌ తన ఫ్రెండ్స్‌‌తో కలిసి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడిని హత్య చేశాడు. మొదట మిస్సింగ్‌‌ కేసు నమోదు చేయగా.. పోలీసులు ఎంక్వరీలో అసలు విషయం బయటపడింది. దీంతో కానిస్టేబుల్‌‌తో పాటు మరో నలుగురు వ్యక్తులు, మహిళను అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం వరంగల్‌‌ సీపీ సన్‌‌ప్రీత్‌‌సింగ్‌‌ వెల్లడించారు.

హనుమకొండ జిల్లా చింతగట్టుకు చెందిన బాషబోయిన శ్రీనివాస్ ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం స్టేషన్‌‌లో కానిస్టేబుల్‌‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటాపురం గ్రామానికి చెందిన చిట్టెం నిర్మలతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మహిళ కుటుంబ సభ్యులకు తెలియడంతో వీరు తమకు బంధువైన, చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు చిట్టెం సాయిప్రకాశ్‌‌ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో వారంతా కలిసి కానిస్టేబుల్‌‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన ఆఫీసర్లు కానిస్టేబుల్‌‌ శ్రీనివాస్‌‌ను సస్పెండ్‌‌ చేశారు. దీంతో సాయిప్రకాశ్‌‌పై కక్ష పెంచుకున్న కానిస్టేబుల్‌‌ అతడిని హత్య చేసేందుకు నిర్ణయించాడు. ఈ విషయాన్ని తనకు ఫ్రెండ్స్‌‌ అయిన డెవిలీ సాయి, సభావత్‌‌ అఖిల్‌‌నాయక్‌‌, రాజు, ఆలోత్‌‌ అరుణ్‌‌కుమార్‌‌కు చెప్పడంతో వారు కూడా సహకరించేందుకు  ఒప్పుకున్నారు. 

దృశ్యం సినిమాను తలపించేలా...

ఈ నెల 15న తమ బంధువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఈ విషయాన్ని నిర్మల కుటుంబ సభ్యులు సాయిప్రకాశ్‌‌కు చెప్పారు. దీంతో నిర్మల, ఆమె భర్తతో పాటు రోగిని తన కారులోనే హనుమకొండలోని ఓ ప్రైవేట్‌‌ హాస్పిటల్‌‌కు తీసుకెళ్లాడు. అక్కడ డ్రాప్‌‌ చేసిన అనంతరం గోపాలపూర్‌‌లోని తన ఫ్రెండ్‌‌ వద్దకు వెళ్తున్నాడు. ఈ విషయాన్ని నిర్మల కానిస్టేబుల్‌‌ శ్రీనివాస్‌‌కు చెప్పింది. దీంతో శ్రీనివాస్, అతని ఫ్రెండ్స్ రాత్రి 11.30 గంటలకు సాయి ప్రకాశ్‌‌ కారును ఫాలో అయి గోపాలపూర్‌‌ క్రాస్‌‌ సమీపంలో అడ్డగించారు.

అనంతరం కారులో ఎక్కి సాయిప్రకాశ్‌‌ను కొట్టుకుంటూ హసన్‌‌పర్తి శివారు వద్ద గొంతుకు శాలువా బిగించి హత్య చేశారు. హత్య విషయం బయట పడకుండా సాయిప్రకాశ్‌‌ను డెడ్‌‌బాడీకి బట్టలు మార్చేసి, హుస్నాబాద్‌‌ సమీపంలోని జిల్లెలగడ్డ తండా వద్ద పాడుబడ్డ బావిలో పడేశారు. అనంతరం కాజీపేట రైల్వేస్టేషన్‌‌కు వచ్చి నరసాపూర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌లో సాయి ప్రకాశ్‌‌ను సెల్‌‌ఫోన్‌‌ను పారేసి, కారును హనుమకొండ ఏషియన్‌‌ మాల్‌‌ సమీపంలో వదిలేసి వెళ్లిపోయారు. 

మిస్సింగ్‌‌ కేసు నమోదు.. ఎంక్వైరీలో బయటపడ్డ మర్డర్‌‌

జిల్లెలగడ్డ తండా వద్ద బావిలో డెడ్‌‌బాడీని గుర్తించిన స్థానికులు 17న పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గుర్తు తెలియని వ్యక్తి, అను మానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డెడ్‌‌బాడీ కుళ్లిపోవడంతో అక్కడే పూడ్చివేశారు. మరోవైపు 15న హనుమకొండకు వెళ్లిన సాయిప్రకాశ్‌‌ రెండు రోజులైనా తిరిగి రాకపోవడంతో అతడి తమ్ముడు సాయితేజ 18న హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు.

ఈ క్రమంలో సాయి ప్రకాశ్‌‌ కారును ఓ ఆటో ఫాలో అయినట్లు గుర్తించి ఎంక్వైరీ చేసి నిందితులను గుర్తించారు. డెవిలీ సాయి హనుమకొండ బస్టాండ్‌‌ వద్ద ఉన్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కానిస్టేబుల్‌‌ శ్రీనివాస్‌‌, అఖిల్‌‌నాయక్‌‌, రాజు, అరుణ్‌‌కుమార్‌‌తో పాటు నిర్మలను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి  కారు, రెండు ఆటోలు, రెండు బైక్‌‌లు, ఎయిర్‌‌ పిస్టల్‌‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌‌కుమార్‌‌, ఏఎస్పీ మన్నన్‌‌ భట్‌‌ పాల్గొన్నారు