కేవీకేలకు రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇస్తలే

కేవీకేలకు రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇస్తలే

నిధులు లేక వెలవెలబోతున్న కృషి విజ్ఞాన కేంద్రాలు

  • సెంట్రల్ ఫండ్  జీతాలకే సరి..
  •  మెయింటెనెన్స్​ చేయలేక ఇబ్బందులు పడుతున్న ఎన్జీవోలు

వనపర్తి, వెలుగు: వ్యవసాయ అభివృద్ధికి కేంద్రం ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేక పోతున్నాయి. తెలంగాణ ఏర్పాటు అనంతరం వీటికి ప్రభుత్వం పైసా ఇవ్వకపోవడంతో కేంద్రం ఇచ్చే రూ.కోటి బడ్జెట్ తో నెట్టుకొస్తున్నారు. ఈ నిధుల్లో రూ.90 లక్షల వరకు శాస్త్రవేత్తల జీతభత్యాలకు ఖర్చవుతోంది. మిగిలిన రూ.10 లక్షలతో ఏడాది మొత్తం సరిపెట్టుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శాస్త్రవేత్తలను సమర్థవంతంగా వాడుకోవడంలో రాష్ట్ర  ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శలున్నాయి. ఇక్కడ పని చేస్తున్న శాస్త్రవేత్తలు అలంకారప్రాయంగా మారారనే అభిప్రాయం ఉంది. 

ఎన్జీవోల ఆధ్వర్యంలో ఐదు కేవీకేలు..  

రాష్ట్రంలోని కేవీకేలలో ఐదు కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలు నడిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఇవి పని చేస్తున్నా కనీసం మెయింటెనెన్స్ కు నిధులు మంజూరు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే రైతు శిక్షణలకే ఇక్కడ పని చేస్తున్న సైంటిస్టులు పరిమితమయ్యారు. డ్రై ల్యాండ్  అగ్రికల్చర్, హార్టికల్చర్, టిష్యూ కల్చర్, సెరీకల్చర్, హోం సైన్స్, గ్రాఫ్టింగ్  వంటి వాటిలో రైతులకు శిక్షణ ఇచ్చి కొత్త తరహా సేద్యానికి శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఆయా జిల్లాల్లోని వ్యవసాయ పద్దతులను, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయడంతో పాటు అక్కడి నేలల స్వభావాన్ని బట్టి ఏ పంటలు సాగు చేయాలో రైతులకు సూచనలు ఇచ్చేందుకు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలను నెలకొల్పింది. వనపర్తి జిల్లా మదనాపురం, కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నల్గొండ జిల్లా గడ్డిపల్లి, మెదక్ జిల్లా తాటిపల్లితో పాటు జహీరాబాద్ లో కృషి విజ్ఞాన కేంద్రాలను ఎన్జీవోలకు అప్పగించింది. ప్రతి ఏటా రూ.కోటి చొప్పున వీటికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ప్రతి కేవీకేలో 10 నుంచి 15 మంది సైంటిస్టులు, ఇతర సిబ్బందిని నియమించి వారికి వేతనాలను చెల్లిస్తున్నారు.కేంద్రం ఇచ్చే రూ.కోటిలో రూ.90 లక్షలు జీతాలకే సరిపోతున్నాయి. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తే కేవీకేలు  పటిష్టం అవుతాయని అంటున్నారు. 

కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో శాస్త్రవేత్తలు పర్యటించి రైతులు, మహిళలు, ఇతర వర్గాలను చైతన్య పర్చాల్సి ఉంది. వనపర్తి జిల్లాలోని మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం 1996లో మంజూరు చేసింది. యూత్  ఫర్ యాక్షన్  అనే స్వచ్ఛంద సంస్థ దీనిని నడిపిస్తోంది. కేవీకేకు అప్పటి ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూమిలో పండ్ల తోటల పెంపకంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీ, టిష్యూ కల్చర్  ద్వారా మొక్కల పెంపకం, వివిధ పండ్ల తోటలు ఏర్పాటు చేశారు. మొక్కలకు అంట్లు కట్టే విధానాన్ని మహిళలు, రైతులకు నేర్పించేందుకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. అప్పట్లో వీరి కార్యకలాపాలు జిల్లా రైతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఎన్జీవోల ఆధ్వర్యంలో నడిచే కృషి విజ్ఞాన కేంద్రాలు నిధులు లేక వెలవెల బోతున్నాయి. కేవలం ట్రైనింగ్ లకే పరిమితమయ్యారు. వ్యవసాయ రంగంలోని మార్పులను అధ్యయనం చేసి అందుకు తగ్గట్టుగా రైతులకు అవగాహన కల్పించాల్సిన కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రస్తుతం రాష్ట్రంలో అలంకారప్రాయంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 రాష్ట్ర సర్కారు ఫండ్స్​ ఇయ్యాలి

కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.కోటి కేటాయిస్తే కేవీకేలు ఉపయోగంలోకి వస్తాయి. మేలు రకం విత్తన ఉత్పత్తితో పాటు సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ ఇవ్వాలి. తోటల పెంపకం, చీడపీడల నివారణ, సేంద్రియ పద్ధతులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాల్సి ఉంది. - శివకుమార్ రెడ్డి, రైతు, కొత్తకోట

విలీనం చేసుకోవాలి..

ఎన్జీవోలు నిర్వహిస్తున్న కేవీకేలను అగ్రికల్చర్  యూనివర్శిటీలో విలీనం చేయాలి. ఎన్జీవోలు సేవలందించకుంటే వారిని తప్పించి ప్రభుత్వమే నడిపించాలి. కేవీకేల ద్వారా యువ రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారిని వ్యవసాయం వైపు ఆకర్షితులయ్యేలా చూడాలి. - నరసింహారెడ్డి, వ్యవసాయ నిపుణులు, మహబూబ్ నగర్