అశ్లీల వీడియోల నుంచి పిల్లల్ని కాపాడాలి

  • అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ పెట్టాలి
  • ప్రభుత్వాన్ని కోరిన స్వచ్ఛంద సంస్థలు
  • పోర్న్ సైట్స్​ను సర్కారే కట్టడి చేయాలి
  • స్మార్ట్​ఫోన్ల కారణంగానే లైంగిక దాడులు పెరిగినయ్
  • పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి
  • రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్జీవోల ప్రతినిధులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌/ఖైరతాబాద్, వెలుగు: పోర్న్‌‌‌‌ వీడియోల నుంచి పిల్లల్ని కాపాడేందుకు ముందుకు రావాలని ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఈ ఇష్యూపై అసెంబ్లీలో కనీసం ఒక రోజు పూర్తిగా చర్చించాలని కోరాయి. స్మార్ట్‌‌‌‌ఫోన్లలో చిన్నారులు పోర్న్ వీడియోలు చూస్తూ మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి. అశ్లీల వీడియోల కారణంగానే చిన్నారులపై టీనేజర్స్, పెద్దలు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని తెలిపాయి. తమ పిల్లలు స్మార్ట్​ఫోన్లలో ఏం చూస్తున్నారనే దానిపై పేరెంట్స్ ఓ కన్నేసి ఉంచాలని కోరాయి.

 పోర్న్​సైట్స్ కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అశ్లీల వెబ్​సైట్లకు బలవుతున్న పిల్లల భద్రతపై అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చిందని తెలిపాయి. అంకురం, ఎంవీ ఫౌండేషన్, తల్లుల కమిటీల ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో శుక్రవారం రౌండ్ టేబుల్‌‌‌‌ సమావేశం నిర్వహించారు. ‘చిన్నారులు, మైనర్లపై లైంగిక దాడులు, పోర్న్‌‌‌‌ వీడియోల నుంచి కాపాడుదాం’ అనే టాపిక్​పై చర్చించారు. ఎంవీ ఫౌండేషన్‌‌‌‌ నేషనల్​ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ వెంకట్‌‌‌‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో అంకురం సుమిత్ర, సజయ, ఉషారాణి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. పోర్న్‌‌‌‌ వీడియోలను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యల గురించి పలు తీర్మానాలు చేశారు. పోక్సో చట్టాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రేప్​లకు పోర్న్‌‌‌‌ వీడియోలే కారణం

బాలికలపై రోజురోజూ పెరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పోర్న్‌‌‌‌ వీడియోలే ప్రధాన కారణమని వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతి గంటకు నాలుగు రేప్​లు జరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌‌‌‌ బ్యూరో వెల్లడించిందని గుర్తు చేశారు. హాస్టళ్లు, షెల్టర్‌‌‌‌‌‌‌‌ హోమ్స్‌‌‌‌లో బాలికలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, కుటుంబాల్లోని పిల్లలపైనా లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయని తెలిపారు. పోర్న్‌‌‌‌ వీడియోల ప్రభావం సమాజంపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అశ్లీల వీడియోల బారినుంచి పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా తల్లిదండ్రులపై ఉందని, పిల్లలు, టీనేజర్ల చేతికి స్మార్ట్​ఫోన్లు ఇవ్వకూడదని తెలిపారు. ఒకవేళ ఇచ్చినా వారు ఏం చూస్తున్నారో గమనించాలన్నారు. కరోనా టైమ్​లో పిల్లలు స్మార్ట్​ఫోన్​లకు చాలా అడిక్ట్ అయ్యారని, మొదట గేమ్స్​కు బానిసలయ్యారని తెలిపారు. తర్వాత పోర్న్ వీడియోలు చూడటం ప్రారంభించారన్నారు. అన్ని రకాల వ్యసనాలకు స్మార్ట్​ఫోన్లే కారణమని తెలిపారు. పోర్న్ సైట్లు ఓపెన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

పోర్న్ వీడియోలు అరికట్టాలి

పోర్న్‌‌‌‌ వీడియోలు సమాజాన్ని చెడుదారి పట్టిస్తున్నాయి. మంచీ చెడు తెలియని వయస్సులో పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నయ్. పోర్న్‌‌‌‌ వీడియోలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ప్రజల్లో ప్రభుత్వం అవగాహన పెంచాలి. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. వారిపై నిరంతర పర్యవేక్షణ అవసరం. పిల్లల చేతికి ఫోన్స్‌‌‌‌ ఇచ్చాక గమనిస్తూ ఉండాలి. అవసరమైతే తప్ప ఫోన్స్‌‌‌‌ వాడకుండా చూడాలి. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సెర్చింగ్‌‌‌‌లో ఎలాంటి వీడియోస్ చూస్తున్నారనేది ఎప్పటికప్పుడు చెక్​చేయాలి.
– సుమిత్ర, అంకురం, ఆర్గనైజర్‌‌‌‌‌‌‌‌


ఫ్యామిలీ లింక్​తో కంట్రోల్​..

పిల్లలు వాడుతున్న స్మార్ట్‌‌‌‌ఫోన్స్‌‌‌‌లో గూగుల్ ఫ్యామిలీ లింక్‌‌‌‌ను ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌ చేయాలి. దీంతో పిల్లలపై కన్నేసి ఉంచొచ్చు. ఎవరితో చాట్‌‌‌‌ చేస్తున్నారు? ఎంత సేపు చాట్‌‌‌‌ చేస్తున్నారు? అనేది తెలుస్తుంది. ఎలాంటి లింక్స్‌‌‌‌ ఓపెన్ చేస్తున్నారనే విషయం తెలుసుకోవచ్చు. గూగుల్ ఫ్యామిలీ యాప్స్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌ చేస్తే పోర్న్‌‌‌‌ వీడియోలు ఓపెన్ కావు. ముఖ్యంగా పిల్లల్ని ఖాళీగా ఉంచొద్దు. సాధ్యమైనంత వరకు స్మార్ట్‌‌‌‌ఫోన్స్‌‌‌‌కి దూరంగా ఉంచాలి. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహంగా ఎక్కువసేపు గడపాలి.
– శ్రీధర్‌‌‌‌‌‌‌‌, ఐటీ ఎక్స్‌‌‌‌పర్ట్‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌