అశ్వాపురం వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమ్మగారిపల్లి వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ ప్రాజెక్టును ద్విసభ్య కమిటీ బుధవారం సందర్శించనుంది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ పనులను నిలిపివేయాలని దుమ్ముగూడెం మండలానికి చెందిన కొందరు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)ను ఆశ్రయించారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఎన్జీటీ మార్చిలో రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. అయినా పనులను కొనసాగించడంతో వారు మరోసారి ఎన్జీటీని ఆశ్రయించారు.
ALSO READ: దేశ ప్రజలకు బుర్ర లేదనుకుంటున్నారా?
ఈ నేపథ్యంలో అధికారులు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎన్జీటీ నియమించిన గోదావరి నది జలాల బోర్డు ఎస్ఈ, హైదరాబాద్ లోని కేంద్ర పర్యావరణ ఫారెస్ట్ వాతావరణ మార్పు శాఖ రీజినల్ డైరెక్టర్ తో కూడి ద్విసభ్య కమిటీ బుధవారం ప్రాజెక్టును సందర్శించి నివేదికను అందించనున్నారు.