
- కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.లక్ష ఫైన్
- ఇరిగేషన్, టూరిజం శాఖల అఫిడవిట్లపై బెంచ్ సంతృప్తి
- కేసు కొట్టివేతతో ఎట్టకేలకు రివర్ పెండింగ్ పనులకు మోక్షం
కరీంనగర్, వెలుగు : కరీంనగర్ లోని మానేరు రివర్ ఫ్రంట్ పనులకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్టీటీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నదిలో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ వరద నియంత్రణ పనులకు, టూరిజం శాఖ చేపట్టిన పనులు 50 హెక్టార్లలోపే ఉన్నందున ప్రస్తుతానికి ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. టూరిజం శాఖ భవిష్యత్ లో పరిమితికి మించి విస్తీర్ణంలో పనులు చేపడితే కచ్చితంగా ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలని తీర్పులో పేర్కొంది. ఇరిగేషన్, టూరిజం శాఖలు సమర్పించిన అఫిడవిట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన ట్రిబ్యునల్.. కేసు కొట్టేస్తున్నట్లు తీర్పునిచ్చింది. చైన్నైలోని సౌత్ జోన్ జోన్ ఎన్టీటీ జడ్జి జస్టిస్ పుష్ప సత్యనారాయణ, విజయ్ కులకర్ణి ఇచ్చిన తుది తీర్పు కాపీని ఎన్జీటీ వెబ్ సైట్ లో శుక్రవారం అప్ లోడ్ చేశారు. ఎట్టకేలకు కేసును ఎన్జీటీ కొట్టేయడంతో నిరుడు ఆగస్టులో నిలిచిపోయిన రివర్ ఫ్రంట్ పనులకు మోక్షం కలిగింది.
పిటిషనర్ కు రూ.లక్ష ఫైన్
పిటిషనర్ ఉద్ధేశపూర్వకంగానే తప్పుడు అభియోగాలతో పిటిషన్ వేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని ఎన్జీటీ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే ప్రాజెక్టును చేపట్టాలని తొలుత కోరిన పిటిషనర్ .. ఇప్పుడు అకస్మాత్తుగా పిటిషన్ వాపస్ తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంది. దీంతో పిటిషనర్ వెంకట్ రెడ్డికి రూ.లక్ష ఫైన్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఇందులో రూ.50 వేల ఖర్చుతో మొక్కలు నాటాలని, రూ.25 వేలతో పర్యావరణ చట్టాలకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేయాలని , మిగతా రూ.25 వేలతో చెన్నై ఎన్జీటీకి వచ్చే పిటిషనర్లకు సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. మూడు నెలల్లోనే తీర్పును అమలు చేయాలని పేర్కొంది. పిటిషనర్ స్పందించకుంటే ఆ మొత్తాన్ని కరీంనగర్ కలెక్టర్ ఆర్ఆర్ యాక్ట్ కింద వసూలు చేయాలని
ఆదేశించింది.
పనులపై రాజకీయ దుమారం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటప్పటికే ఎన్జీటీలో పిటిషన్ దాఖలు కావడం, 2024 ఆగస్టులో టూరిజం, ఇరిగేషన్ శాఖల పనులపై స్టే విధించడంతో పనులు ఆగిపోయాయి. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోపాటు బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్ సర్కార్ వచ్చాకే రివర్ ఫ్రంట్ పనులను ఆపివేసిందంటూ ఆరోపించారు. అయితే.. కాంగ్రెస్ నేతలు ఎలాంటి కౌంటర్ ఇవ్వకపోవడంతో.. గంగుల ఆరోపణలు నిజమేననే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఎన్జీటీ కేసును కొట్టేసినందున పనుల్లో పురోగతి ఏ స్థాయిలో ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో భారీగా అవినీతి జరిగిందంటూ కరీంనగర్ తాజా మాజీ మేయర్ సునీల్ రావు ఆరోపణలు చేయడం, విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.