- ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో రాష్ట్ర సర్కారు అఫిడవిట్
- లిఫ్టును ముందే కంప్లీట్ చేయాలని చూస్తోంది
- ‘వెలుగు’ పత్రిక ఈ వివరాలతో ఆర్టికల్ కూడా ఇచ్చిందని వెల్లడి
- ఏపీ సర్కారుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.. నేడు విచారణ
హైదరాబాద్, వెలుగు: నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించినా పట్టించుకోకుండా.. ఏపీ సర్కారు సంగమేశ్వరం లిఫ్ట్ స్కీం పనులు చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర సర్కారు తరఫున ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ సోమవారం ఈ అఫిడవిట్ ఫైల్ చేశారు. కృష్ణా బోర్డుకు సంగమేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించి, అన్ని పర్మిషన్లు తీసుకున్నాకే పనులు మొదలుపెట్టాలని ఎన్జీటీ నిరుడు అక్టోబర్29న తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఈ ఆదేశాలను ఏపీ అతిక్రమించిందని వివరించారు. అనుకున్నదానికంటే ముందుగానే ఏడాదిన్నరలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏపీ సర్కారు టార్గెట్ పెట్టుకుందని, ఈ మేరకు వేగంగా పనులు చేస్తోందని తెలిపారు. ‘వెలుగు’ పత్రిక ఈ వివరాలతో జనవరి 14న ఆర్టికల్ ప్రచురించిందని వివరించారు. ఏపీ సర్కారు రాయలసీమ లిఫ్ట్ స్కీం పనుల్లో వేగం పెంచిందని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ జనవరి 19న కృష్ణాబోర్డుకు కంప్లైంట్ చేశారని, ఎన్జీటీ తీర్పును అతిక్రమించిన ఏపీ సర్కారుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నేడు ఎన్జీటీలో విచారణ
ఏపీ సర్కారు ఎన్జీటీ తీర్పును ధిక్కరించి రాయలసీమ లిఫ్ట్ స్కీం పనులు చేస్తోందంటూ నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్జీటీ చెన్నై బెంచ్ మంగళవారం విచారించనుంది. ఎన్జీటీ జ్యుడిషియల్ మెంబర్ జస్టిస్ కె. రామకృష్ణన్, టెక్నికల్ మెంబర్ సైబల్ దాస్ గుప్తా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసును విచారించనున్నారు. ఈనెల రెండో తేదీనే ఈ కేసును ఎన్జీటీలో విచారణకు రాగా.. ఏపీ అడ్వొకేట్ వాయిదా కోరారు. దాంతో కేసు 16వ తేదీకి వాయిదా పడింది.
For More News..