ఏపీ సంగమేశ్వరం ఎత్తిపోతల పనులపై ఎన్జీటీ ఆగ్రహం

ఏపీ సర్కార్ అక్రమంగా కడుతున్న సంగమేశ్వరం ఎత్తిపోతల పనులపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ ఉల్లంఘనలు, ప్రాజెక్టు నిర్మాణ పనులపై నివేదికను నిబంధనల ప్రకారం దాఖలు చేయాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)ని ఎన్జీటీ ఆదేశించింది. ఆగస్టు 27 లోపు నివేదిక ఇవ్వాలని కృష్ణాబోర్డు , కేంద్ర పర్యావరణశాఖను ఎన్జీటీ  ఆదేశించింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సంగమేశ్వరం రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఏపీ చేస్తున్న పనుల ఫోటోలను ఎన్జీటీకి ఇచ్చారు తెలంగాణ తరపు లాయర్లు. కృష్ణాబోర్డు , తెలంగాణ దాఖలు చేసిన ఫోటోలు చూస్తే పర్యావరణ ఉల్లంఘనలు, కోర్టు ధిక్కరణ జరిగినట్లు అర్ధమవుతుందని చెప్పింది ఎన్జీటీ. కృష్ణాబోర్డు నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత తదుపరి ఉత్తర్వులు ఇస్తామంది ఎన్జీటీ. జులై 7 వ తేదీనే పనులు నిలిపివేసినట్లు ఎన్జీటీకి తెలిపింది  ఏపీ ప్రభుత్వం. ఏపీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లైతే అధికారులను జైలుకు పంపే సందర్భాలు ఉన్నాయా అని పిటిషనర్లని అడిగింది ఎన్జీటీ.కృష్ణాబోర్డు  నివేదికపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఏపీ లాయర్లకు సూచించింది ఎన్జీటీ ధర్మాసనం.