- రీచ్‌ల్లో ఇసుక అయిపోతుండడంతో రాత్రివేళ రవాణా
- పర్మిషన్ లేనిదే తవ్వకాలు చేపట్టొద్దని ఎన్జీటీ ఆదేశాలు
- కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇసుకను తోడేస్తున్న మాఫియా
వీణవంక మండలం కొండపాక సమీపంలోని మానేరులోకి శనివారం రాత్రి రెండు లారీలు, ఓ జేసీబీ వెళ్లాయి. ఆదివారం తెల్లవారుజామున పొలాల వద్దకు వెళ్లిన కొందరు రైతులు మానేరులో లారీల లైట్లను గమనించి అధికారులకు సమాచారమిచ్చారు. తాము అసలు నదిలోకే వెళ్లలేదని బుకాయిద్దామని ఇసుక మాఫియా లారీలను బయటికి రప్పించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. మరోవైపు పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు వచ్చేవరకు కదలినిచ్చేది లేదని స్థానికులు అడ్డుకున్నారు. చాలాసార్లు ఫోన్లు చేశాక మధ్యాహ్నం 3 గంటలకుగానీ అధికారులు అక్కడికి చేరుకోలేదు. గ్రామస్తుల ఒత్తిడితో అధికారులు రెండు టిప్పర్లను స్టేషన్‌కు తరలించారు.
కరీంనగర్, వెలుగు: ఎన్జీటీ ఆదేశాలతో ఐదు నెలలుగా మానేరులో నిలిచిపోయిన ఇసుక తవ్వకాలు మళ్లీ గుట్టుగా మొదలయ్యాయి. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులను మామూళ్లతో మ్యానేజ్‌చేసి ఇసుక మాఫియా రాత్రి వేళలో లారీల కొద్దీ ఇసుకను తోడేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక రీచుల్లో నిల్వలు దగ్గరపడడంతో కొందరు కాంట్రాక్టర్లు.. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుక డంప్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులను ఉల్లంఘించడంపై పర్యావరణవేత్తలు, రైతులు మండిపడుతున్నారు.
ఎన్జీటీ ఉత్తర్వుల్లో ఏముంది.. ?
పర్యావరణ చట్టాలకు విరుద్ధంగా నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని 2022 డిసెంబర్ లోనే ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను కేవలం మానేరుకు అటువైపు ఉన్న పెద్దపల్లి జిల్లాకే పరిమితం చేసి.. ఇటువైపున్న కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేపట్టారు. దీంతో ఓ యాక్టివిస్టు ఎన్జీటీ చెన్నై బెంచ్‌ను ఆశ్రయించడంతో సమగ్ర విచారణానంతరం వాణిజ్య అవసరాల కోసం ఇసుక తవ్వకాలకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్(ఈసీ) తప్పనిసరని, క్లియరెన్స్ లేనందున మానేరులో తవ్వకాలను నిలిపివేయాలని ఏప్రిల్ 28న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ఈసీ క్లియరెన్స్ పొంది ఉంటే కాంట్రాక్ట్ ఏజెన్సీ తవ్వకాలు కొనసాగించవచ్చని పేర్కొంది.
తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా కరీంనగర్ జిల్లాలోని వావిలాల, ఊటూరు, చల్లూరు, మల్లారెడ్డిపల్లి, కొండపాక, కోరేకల్, పోతిరెడ్డిపల్లి, తనుగుల క్వారీల్లో తవ్వకాలపై స్టే కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతోపాటు కొత్తగా ఇసుక తవ్వకాలు చేపట్టొద్దని, రీచుల్లో నిల్వ ఉన్న ఇసుకను తరలించవచ్చని జులై 12న ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు మూడున్నర నెలలుగా రీచుల్లోని ఇసుక తరలింపు మాత్రమే జరుగుతోంది. తాజాగా ఎలాంటి పర్యావరణ అనుమతులు తీసుకోకుండా మళ్లీ ఇసుక తవ్వకాలకు దిగడం వివాదాస్పదంగా మారింది.
రెవెన్యూ, పోలీస్ అధికారులు సైలెన్స్
అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ ఆఫీసర్లు మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఆదివారం కొండపాక సమీపంలోని మానేరులో లారీలను ఆపితే.. 'ఇసుక లారీలతో మీకేం సంబంధం, వాళ్లకు ఇసుక తవ్వుకోవడానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయట. పైసల కోసమే లారీలను ఆపారంట కదా' అని గ్రామస్తులను పోలీసులు బెదిరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మానేరు లో అక్రమంగా ఇసుక తోడుతూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కడమేగాక లారీ డ్రైవర్ ను కొట్టారంటూ ఓ మాజీ సర్పంచ్ తోపాటుమరికొందరు కొండపాక గ్రామస్తులపై కేసు నమోదు చేయించేందుకు ఇసుక మాఫియా ప్రయత్నించిందని గ్రామస్తులు ఆరోపించారు.
ఎన్జీటీలో కంప్లైంట్ చేస్తాం..
పర్యావరణ అనుమతులు లేకుండా మానేరులో ఇసుక మైనింగ్ యాక్టివిటీ చేయొద్దని ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ అధికారులు ఆ ఆదేశాలకు వక్రభాష్యం చెప్తూ ఇసుక రీచుల్లో డంప్ చేసిన ఇసుకను తరలిస్తున్నారు. అక్కడితో ఆగకుండ ఇప్పుడు ఏకంగా మానేరులో మళ్లీ ఇసుక తవ్వుతుండడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమే. దీనిపై మళ్లీ మేం ఎన్జీటీని ఆశ్రయిస్తాం.
సంది సురేందర్ రెడ్డి, మానేరు పరిరక్షణ సమితి