కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు తలుచుకుంటే నేషనల్హైవే అలైన్మెంట్లు కూడా మారిపోతున్నాయి. కరీంనగర్లో ఓటమి పాలై, నామినేటెడ్ పదవితో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న రూలింగ్పార్టీ లీడర్ ఒకరు తన పలుకుబడితో సొంత మెడికల్ కాలేజీ పక్క నుంచి 563 నేషనల్హైవేను మళ్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్చుట్టూ ఇప్పటికే ఒక రింగు రోడ్డు ఉన్నప్పటికీ, దానిని కాదని అలైన్మెంట్ మార్చేశారు. హైవేను కాస్తా 30 కిలోమీటర్లు అదనంగా తిప్పుకుంటూ కాలేజీ పక్కగా తీసుకెళ్తున్నారు. దీని వల్ల కొత్తగా ఐదు బ్రిడ్జిలు కట్టాల్సి వస్తోంది. మానేరు మీద ఇప్పటికే రెండు వంతెనలు ఉండగా,మూడో వంతెన రాబోతోంది. ఫలితంగా ప్రభుత్వంపై రూ.500 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. ఈ రోడ్డు వల్ల రైతులు వందల ఎకరాల పచ్చని పంట భూములను కోల్పోవాల్సి వస్తోంది. ఒక్క నేత స్వార్థం కోసం అటు ప్రభుత్వం, ఇటు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రతిపక్ష లీడర్లు, పబ్లిక్ విమర్శిస్తున్నారు.
ఇప్పటికే రింగు రోడ్డు ఉన్నప్పటికీ..
జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ కు వెళ్లే ఎన్ హెచ్ 563 సుమారుగా 127 కి.మీ దూరం ఉంటుంది. జగిత్యాల నుంచి వచ్చే వాహనాలు నేరుగా కొత్తపల్లి నుంచి రేకుర్తి అంబేద్కర్ విగ్రహం, శాతావాహన యూనివర్సిటీ రోడ్, చింతకుంట రోడ్డుకు వెళ్తాయి. ఇక్కడి నుంచి పద్మానగర్ బైపాస్ మీదుగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఇప్పటికే ఉన్న వంతెన మీది నుంచి హైదరాబాద్, వరంగల్ కు పోవచ్చు. లేదంటే కొత్తపల్లి టౌన్ లోకి రాకముందే గతంలో నిర్మించిన బైపాస్ ఉంది. ఇది నేరుగా చింతకుంటకు వెళ్తుంది. ఇదివరకే ఉన్న 100 ఫీట్ల రెండు బైపాస్ లలో దేన్ని వాడుకున్నా కొత్తగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుంది.
కానీ రూలింగ్ పార్టీ లీడర్ల ప్రోద్బలుతో అధికారులు కొత్తపల్లి నుంచి కొక్కెరకుంట, నగునూరు, దుర్శేడ్ మీదుగా మానకొండూరు అవతల మెయిన్ రోడ్డుకు కలుపుతూ బైపాస్ ప్రపోజల్ పెట్టారు. దీని వల్ల సుమారు 25 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. నిర్మాణానికి రూ. 500 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. ఈ ప్రపోజల్స్ మేరకు కొక్కెర కుంట దగ్గర రైల్వై లైన్ వద్ద భారీ వంతెన నిర్మించాల్సి ఉంటుంది. మంచిర్యాల రోడ్ లో ఒక వంతెన, రామగుండం రోడ్ లో మరో వంతెన, దుర్శేడ్ వద్ద రైల్వే వంతెన.. మానేరు పై మరో వంతెన, ఇలా ఐదు పెద్ద వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది. దీంతో ఖర్చు పెరగడమేకాక.. బడుగు రైతులకు సంబంధించిన వందల ఎకరాలు రోడ్డు కింద పోతాయి.
ఇష్టమున్నట్టు...
కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డులో కుడి వైపున మిషన్ భగీరథ పైప్ లైన్ వేశారు. దీంతో రోడ్డు విస్తరణ కోసం ఎడమవైపు మాత్రమే భూమి సేకరిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు తమకున్న మొత్తం భూమి కోల్పోతున్నారు. మానకొండూరు దాటిన తర్వాత ఈదులగట్టపల్లి, చెంజర్ల, ఖాదర్ గూడెం, గట్టుదుద్దెనపల్లి మొదలుకుని హుజూరాబాద్, ఎల్కతుర్తి, వరంగల్ వరకు ఎక్కువ భాగం వన్ సైడే భూములు తీసుకుంటున్నారు. ఖాదర్ గూడెం పరిధిలో వరంగల్ కు వెళ్తుంటే ఎడమ వైపు మిషన్ భగీరథ పైపు లైన్ ఉంది. అయినా అటు వైపే భూమిని సేకరిస్తున్నారు. కుడి వైపున ఓ చిట్ ఫండ్ కు చెందిన వెంచర్..కొన్ని ఇండ్లున్నాయి. వీరికి బెన్ ఫిట్ చేయాలనే ఒక వైపు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా గట్టుదుద్దెనపల్లి, సింగాపూర్, సిర్సపల్లి, రంగాపూర్ గ్రామాలకు చెందిన వారు కూడా ఇబ్బంది పడుతున్నారు.
పరిహారం పెంచాలని ఆందోళన
జగిత్యాల నుంచి వరంగల్ నేషనల్ హైవే కోసం 560 హెక్టార్లు అవసరమని గుర్తించగా.. ఇప్పటికే 123 హెక్టార్లు అందుబాటులో ఉంది. ఇంకా 463 హెక్టార్లు సేకరించాల్సిఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ భూములకు మంచి రేటు ఉంది. ప్రభుత్వం చెప్తున్న పరిహారం తక్కువగా ఉందని భావిస్తున్న రైతులు భూములిచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇక్కడ గుంటకు రూ.15లక్షల వరకు రేటు ఉండగా ప్రభుత్వం మాత్రం మానకొండూరు చుట్టుపక్కల భూములకు గుంటకు కేవలం రూ.63వేలు, గట్టుదుద్దెనల్లి ఏరియాలో రూ. 83వేలుగా నిర్ణయించింది. భూములనే నమ్ముకున్న తమకు అతితక్కువ పరిహారం ఇచ్చి లాక్కుంటే ఎలా బతుకుతామని రైతులు వాపోతున్నారు. ఓపెన్ మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇస్తేనే భూములిస్తామంటున్నారు. భూసేరకణకు వస్తున్న అధికారులకు సహకరించడం లేదు. గ్రామాల్లో ఎలాంటి గ్రామసభలు నిర్వహించకుండానే రేట్లు ఫిక్స్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
బిడ్డలకు ఇచ్చిన భూమి పోతోంది
నాకు ఎకరంన్నర భూమి ఉంది. దీంట్లోంచి ఎకరం భూమి రోడ్డులో పోతోంది. మిగిలేది 20 గుంటలే. ఇది కూడా అటు సగం.. ఇటు సగం తీస్కుంటున్నరు. ఈ భూమిని ఏం జేయాలె. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లకు పెండ్లిళ్లు చేసి చెరికొంత రాసిచ్చిన. రోడ్డుకు పోయే భూములను రాసిచ్చిన్రని అల్లుళ్లు లొల్లి పెడుతున్నరు. ఏం జేయాల్నో అర్థం అయితలేదు. వెలిచాల క్రాస్ నుంచి పోయే బైపాస్ ను విస్తరిస్తేనే మాకు న్యాయం జరుగుతది.
– చిట్కూరి కొంరయ్య, కొత్తపల్లి రైతు