సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న జనం అంతా సొంతూళ్లకు పయనమవుతారు. దీంతో నేషనల్ హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ హైవే టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. 2024 లో సంక్రాంతి సందర్భంగా పంతంగి , కొర్లపాడ్ టోల్ ప్లాజాల దగ్గర అలాగే హైదరాబాద్- వరంగల్ హైవేలోని గూడూరు టోల్ ప్లాజా దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ఈ క్రమంలో ఈ సంక్రాంతికి మళ్లీ అదే సీన్ రిపీట్ కాకుండా ఉండేందుకు టోల్ ప్లాజాల దగ్గర వాహనాల రద్దీని నివారించేందుకు పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHIA) విస్తృత చర్యలు చేపట్టింది. టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు, ప్రత్యేక బస్సులు, ఎమర్జెన్సీ సేవలు ఏర్పాట్లు చేస్తుంది.
ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి విజయవాడ హైవేపై 10 కంటే ఎక్కువ టోల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వర్ రావు తెలిపారు. అలాగే క్రేన్లు , అంబులెన్స్‌లతో సహా అత్యవసర సేవలు ప్రతి 30 కిలోమీటర్లకు అందుబాటులో ఉంటాయని.. ప్రతి 60 కిలోమీటర్లకు టోయింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ALSO READ | తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
అలాగే నల్గొండ రీజియన్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జనవరి 10 నుండి 20 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. జనవరి 10 నుంచి 13 వరకు ఏడు బస్ డిపోల నుంచి మొత్తం 398 ప్రత్యేక సర్వీసులు, జనవరి 15 నుంచి 20 వరకు 370 సర్వీసులు నడపనున్నట్లు రీజనల్ మేనేజర్ కె. జాన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రత్యేక బస్సులు అత్యధిక ప్రయాణికుల డిమాండ్ ఉన్న రూట్లలో నడపబడతాయని తెలిపారు.