- రెండ్రోజుల్లో వేదిక ఖరారు చేయనున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టులపై త్వరలో కీలక మీటింగ్ జరగనుంది. నార్త్ రాష్ట్రాలతో పోలిస్తే సౌత్‌లో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవేలపై వివక్ష కొనసాగుతున్నదని, ఈ క్రమంలోనే పనులు నిదానంగా సాగుతున్నాయని ఇటీవల పార్లమెంట్‌లో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మీటింగ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్వహించనున్న ఈ మీటింగ్‌ను హైదరాబాద్ లేదా బెంగళూరు, చెన్నైలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నది.
నేడో రేపో ఈ మీటింగ్ వేదిక, తేదీలు ఖరారు కానున్నట్లు సమాచారం. ఈ మీటింగ్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవే ప్రాజెక్టుల స్టేటస్, భూ సేకరణ, ఫారెస్ట్ అనుమతులు పెండింగ్, కేంద్రం నుంచి రావాల్సిన బిల్స్ వంటి అంశాలను ఆయా రాష్ట్రాల ఎన్‌హెచ్‌ఏఐ రీజనల్ ఆఫీసర్లు, ఆర్ అండ్ బీ అధికారుల నుంచి కేంద్ర రవాణా శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను కేంద్ర రవాణా, అటవీ శాఖ మంత్రులు గడ్కరీ, భూపేంద్ర యాదవ్‌కు అందజేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజనల్ రింగ్ రోడ్‌తో హైదరాబాద్, విజయవాడ విస్తరణతో పాటు పలు కీలక ప్రాజెక్టులపై ఎన్‌హెచ్‌ఏఐ రీజనల్ ఆఫీసర్లు స్టేటస్ రిపోర్ట్‌తో పాటు పలు సమస్యలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తున్నది.