హైదరాబాద్, వెలుగు: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) కేసు నమోదు చేసింది. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యేకు సమాచారం అందించింది. జీడిమెట్లలోని అజయ్ అగర్వాల్ అనే వ్యాపారికి చెందిన ఫ్యాక్టరీపై గత నెల 25న దాడి జరిగింది. గాంధీ అనుచరులు హర్షవర్ధన్ ప్రసాద్, ముజాహిద్ ఖాన్ సుమారు వంద మందితో తమ ఫ్యాక్టరీపై దాడి చేశారని అజయ్ అగర్వాల్ పేట్ బషీరాబాద్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 38/8, 38/9 లో గల భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం పోలీసులు ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే గాంధీతో పాటు పేట్ బషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్, ఎస్సై మల్లేశ్వర్‌పై కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ కేసు ఫైల్ చేసింది. 8 వారాల్లో విచారణ జరిపించి, వివరాలు తెలియజేయాలని మేడ్చల్ డీసీపీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఫ్యాక్టరీపై దాడితో నాకు ఎలాంటి సంబంధం లేదని, అజయ్ అగర్వాల్ ఎవరో నాకు తెలియదని, అతని ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
ALSO READ :టెస్టు పాస్... రెండు చేతులా ఒడిసిపట్టుకున్నరు