
- ఫార్మా ప్రాజెక్టులో సీఎం కుటుంబ సభ్యుల ప్రమేయం లేదు
- జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టం
- ఆరు అంశాలపై విచారణ జరిపామని వెల్లడి
- 6 వారాల్లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీలకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా లగచర్ల పరిసర ప్రాంతాల్లో ఫార్మా సిటీ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ సందర్భంగా జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. నిందితుల అరెస్టులు, రైతులు, గిరిజనులపై జరిగిన దాడులకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నివేదికలో పేర్కొనాల్సిన అంశాలను ప్రస్తావించింది. ఫార్మా ప్రాజెక్ట్‌లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం లేదని పేర్కొంది.
ఆరు అంశాలపై విచారణ జరిపామని, పూర్తి వివరాలు రాబట్టేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని తెలిపింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక సోమవారం వెలుగులోకి వచ్చింది. లగచర్ల, చుట్టుపక్కల గ్రామాల్లో ఫార్మా సిటీ నిర్మాణానికి 1,374 ఎకరాలను సేకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా అధికారాలుపై దాడులు జరిగాయి. ఇందుకు సంబంధించి గతేడాది నవంబర్ 11న బొంరాసిపేట పోలీస్ స్టేషన్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నిందితులు, అనుమానితులను అరెస్ట్ చేసే సమయాల్లో పోలీసులు దారుణంగా వ్యవహరించారని లగచర్ల, ఆర్బీ తండా, పొలిపల్లి, పులిచెర్ల, హకీంపేట గ్రామాలకు చెందిన గిరిజన మహిళలు నవంబర్ 18న కమిషన్‌ను ఆశ్రయించారు.ఈ ఫిర్యాదులను కమిషన్ విచారణకు స్వీకరించింది. కమిషన్ ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ డివిజన్ టీమ్‌లోని ముకేష్తో పాటు ఇన్‌స్పెక్టర్లు యతిప్రకాశ్ శర్మ, రోహిత్ సింగ్‌తో కూడిన బృందం.. నవంబర్ 22 నుంచి 26 వరకు ఆయా గ్రామాల్లో పర్యటించినట్లు నివేదికలో కమిషన్ వెల్లడించింది.
ఇన్వెస్టిగేషన్ డివిజన్ టీమ్ విచారణ చేసిన అంశాలు ఇవే..
పోలీసులు, స్థానిక అధికారులు అత్యుత్సాహం చూపించారా? ‘ఫార్మా ప్రాజెక్ట్’ లో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా? అనే అంశాలను కమిషన్ పరిశీలించింది. బాధిత గ్రామస్తుల వద్ద వివరాలు సేకరించడంతో పాటు.. బాధితులను నిర్బంధించిన లాకప్‌లు, నిందితులు కస్టడీలో ఉన్న జైళ్లను సందర్శించామని పేర్కొంది. ముకేష్ టీమ్ దర్యాప్తు నివేదికను కమిషన్ సమీక్ష కోసం పంపింది. దర్యాప్తు నివేదిక, సిఫార్సులను పరిగణించామని కమిషన్ తెలిపింది. సున్నితమైన విషయంలో పోలీసులు అనుసరించిన విధానం, బాధితులను నిర్బంధించిన లాకప్, పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం సహా పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంపై సీరియస్ అయింది. ఇన్వెస్టిగేషన్ డివిజన్ టీమ్ ఇచ్చిన రిపోర్టులోని అంశాలకు సంబంధించి ఆరు వారాల్లోగా నివేదికలు సమర్పించాలని సీఎస్, డీజీపీలను కమిషన్ ఆదేశించింది.