హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు కీలక మలుపు తిరిగింది. సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ చర్యలకు ఆదేశించింది. లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన సందర్భంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ను NHRC ఆదేశించింది.
డిసెంబర్ 4, 2024న పుష్ప-2 ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించారు. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్ లో కూడా పుష్ప-2 ప్రీమియర్ షో పడింది. ఈ షోను అభిమానులతో కలిసి వీక్షించేందుకు నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వెళ్లాడు. అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు ఒక్కసారి అతనిని చూసేందుకు ఎగబడ్డారు.
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అభిమానులపై లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ, ఆమె కొడుకు శ్రీతేజ్ అభిమానుల కాళ్ల కింద పడి నలిగిపోయారు. ఈ ఇద్దరికీ పోలీసులు వెంటనే సీపీఆర్ చేశారు. రేవతి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. రేవతి కొడుకు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అల్లు అర్జున్ తీరుపై, థియేటర్ యాజమాన్యంపై, పోలీసుల వైఫల్యంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంపై మానవ హక్కుల సంఘం మండిపడింది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన కేసులో నటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంతో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది.
ALSO READ | హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్ : జీరో క్రైం రేటుతో న్యూఇయర్ సెలబ్రేషన్స్
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన మరుసటి రోజే బెయిల్పై విడుదలైనప్పటికీ టాలీవుడ్ ప్రముఖుల ‘ఓదార్పు యాత్ర’ కారణంగా అల్లు అర్జున్పై, తెలుగు సినీ పరిశ్రమపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మృత్యువుతో పోరాడుతూ ఆ పిల్లాడు ఆసుపత్రిలో ఉంటే, ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, అండగా నిలవాల్సింది పోయి అల్లు అర్జున్ను పరామర్శించడంపై అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడం, ఆ తదనంతర పరిణామాలు, టాలీవుడ్ ప్రముఖులు సీఎంతో భేటీ కావడం ఇవన్నీ మన కళ్ల ముందు జరిగిన పరిణామాలే. NHRC ఆదేశాలతో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన మరోమారు వార్తల్లో నిలిచింది.