న్యూఢిల్లీ, వెలుగు: వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో జరిగిన ఘటనపై తెలంగాణ సీఎస్, డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై రెండు వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే నిజాలు తెలుసుకునేందుకు ఒక టీంను లగచర్లకు పంపనున్నట్లు వెల్లడించింది. ఇందులో న్యాయ, విచారణ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపింది.
వారం రోజుల్లో ఈ బృందం నివేదిక సమర్పించనుందని పేర్కొంది. లగచర్లలో ఫార్మా కంపెనీల కోసం భూ సేకరణ వ్యవహారంలో 12 మంది బాధిత మహిళలు ఈ నెల 18న బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఈ కంప్లయింట్‌ను స్వీకరిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఆర్సీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫిర్యాదులోని విషయాలు నిజమైతే, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లేనని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
పోలీసుల శారీరక వేధింపులు, తప్పుడు నేరారోపణలు మోపడంతో బాధితులు ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఫార్మా ప్రాజెక్టు కోసం బలవంతపు భూసేకరణ చేసేందుకు అధికారులు లగచర్లకు వచ్చారని బాధితులు తెలిపారు. గ్రామస్తులపై దాడిలో గర్భిణులను కూడా వదల్లేదన్నారు. సహాయం కోసం ఎవరితోనూ కమ్యునికేట్ చేసే పరిస్థితి లేదని వెల్లడించారు.
ఇంటర్నెట్, విద్యుత్ సేవలను నిలిపివేశారని చెప్పారు. కొందరు బాధితులు భయంతో ఇళ్లు వదిలి అడవులు, సాగు భూముల్లో తలదాచుకుంటున్నారని ఫిర్యాదులో గిరిజనులు ప్రస్తావించారు. కాగా, నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న గ్రామస్తుల వివరాలు రిపోర్ట్‌లో పొందుపరచాలని ఎన్‌హెచ్‌ఆర్సీ స్పష్టం చేసింది. భయంతో దాక్కున్న గ్రామస్తుల పరిస్థితిని మెన్షన్ చేయాలని ఆదేశించింది. బాధిత మహిళలకు వైద్య పరీక్షలు చేశారా? గాయపడిన గ్రామస్తులకు ట్రీట్‌మెంట్ ఇచ్చారా లేదా అనే వివరాలు కూడా జతచేయాలని తెలిపింది.