నేవీలో ఐఎస్ఐ గూఢచర్యం కేసు..

నేవీలో ఐఎస్ఐ గూఢచర్యం కేసు..
  • 7 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
  • తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో తనిఖీలు 
  • 22 సెల్ ఫోన్లు, డివైస్​లు, డాక్యుమెంట్లు స్వాధీనం
  • పలువురు అనుమానితులు అదుపులోకి 

 హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియన్ నేవీలో గూఢచర్యం కేసుకు సంబంధించి తెలంగాణ సహా 7 రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌‌ఐఏ) సోదాలు చేసింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ గూఢచర్యం కార్యకలాపాలకు సంబంధించి ఈ సోదాల్లో కీలక ఆధారాలను సేకరించింది. బుధవారం తెలంగాణ, గుజరాత్‌‌, కర్నాటక, కేరళ, యూపీ, బిహార్‌‌‌‌, హర్యానాలోని16 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినట్టు గురువారం ఎన్ఐఏ ఒక ప్రకటనలో వెల్లడించింది

ఆయా రాష్ట్రాల్లో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, 22 సెల్ ఫోన్లు, డివైస్ లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. కాగా, ఏపీలోని విశాఖపట్నం ఇండియన్ నేవీ విభాగం నుంచి పాక్ ఐఎస్ఐ కీలకమైన రక్షణ శాఖ సమాచారాన్ని సేకరించేందుకు గూఢచర్యానికి పాల్పడినట్టు 2021 జనవరిలో ఏపీ ఇంటెలిజెన్స్ సెల్ గుర్తించింది. సముద్ర తీర ప్రాంతాల్లోని ఇండియన్ బార్డర్స్‌‌కు సంబంధించిన సమాచారం కోసం కుట్ర జరిగినట్లు కేసు నమోదు చేసింది.

ఈ కేసు ఆధారంగా ఎన్‌‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. పాకిస్తాన్‌‌కు సమాచారం అందిస్తున్న అశోక్ సోలంకీ, మన్‌‌మోహన్‌‌ సుందర్‌‌‌‌ పాండా, అల్విన్‌‌ అనే ముగ్గురిని 2023లో అరెస్ట్‌‌ చేసింది. వీరిపై చార్జ్‌‌షీట్‌‌ దాఖలు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా మరోసారి దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది.