తెలంగాణ, ఏపీలో NIA సోదాలు

తెలంగాణ, ఏపీలో NIA సోదాలు

పీఎఫ్ఐ (PFI) సంస్థకు చెందిన పలువురు క్యాడర్ పై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణల్లోని అనేక ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. దీనిపై NIA ఓ ప్రకటన విడుదల చేసింది. నిజామాబాద్ లో 23, హైదరాబాద్ లో 4, జగిత్యాలలో 7, నిర్మల్ లో 2, ఆదిలాబాద్, కరీంనగర్ లలో ఒక్కో ప్రాంతం, ఏపీలోని 2 చోట్ల సోదాలు చేసినట్లు వెల్లడించింది. రూ.8.31 లక్షల నగదు, డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలను  స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. గతంలో పీఎఫ్ఐ  నేతలు అబ్దుల్ ఖాదర్, షేక్ షహదుల్ల, మహమ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ మొబిన్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ కేసును ఆధారంగా చేసుకుని ఆగస్టు 26న ఎఫ్ఐఆర్ ను ఎన్ఐఏ  నమోదు చేసింది.   

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం MS ఫారంలో షేక్ ముఖిద్ ఇంట్లో NIA అధికారుల సోదాలు ముగిశాయి. బ్యాంక్ అకౌంట్, లావాదేవీలపై NIA వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పాస్ పోర్టు సీజ్ చేసిన అధికారులు..బ్యాంక్ పాస్ బుక్ లను తీసుకెళ్లారు. హైదరాబాద్ లోని NIA కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు. జగిత్యాల జిల్లా  కేంద్రంలోని  టీఆర్ నగర్ లో ఉన్న  4 ఇళ్లతో పాటు మెడికల్ షాపులో  సోదాలు చేశారు. టవర్ సర్కిల్  ఏరియాలో సోదాలు  జరిగాయి. ఈ తనిఖీల్లో  ఒకరి ఇంట్లో   డైరీతో పాటు పలు కీలక పేపర్లను  స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని  మదీనా కాలనీలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో NIA ఆఫీసర్లు  తనిఖీలు జరిపారు.