- వరుస బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో కొనసాగుతున్న ఎన్‌ఐఏ గాలింపు
- 2013లో అరెస్టయిన యాసిన్ భత్కల్
- తప్పించుకు తిరుగుతున్న ఇక్బాల్ భత్కల్, రియాజ్ భత్కల్
- ఎన్‌ఐఏ, ఏటీఎస్‌లకు మోస్ట్ వాంటెడ్ గా టెర్రరిస్టులు
- అరబ్ దేశాల్లో తలదాచుకున్నట్లు ఆధారాలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో జంట బాంబు పేలుళ్లతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించిన టెర్రరిస్టులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) తన సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నది. పలు రాష్ట్రాల్లోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్‌తో కలిసి దర్యాప్తు చేస్తున్నది. ఎన్‌ఐఏ వెబ్‌సైట్‌లో ఆ ఇద్దరిని మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పేరుతో టెర్రరిస్టులు హైదరాబాద్ లో జంట పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. గతంలో ముంబై ఏటీఎస్ పోలీసులకు భత్కల్ బ్రదర్స్ చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. కర్నాటకకు చెందిన యాసిన్ భత్కల్.. ఐఎంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక్బాల్ భత్కల్ అలియాస్ మహ్మద్, రియాజ్ భత్కల్ అలియాస్ ఇస్మాయిల్ వరుస పేలుళ్లలో కీలక పాత్ర పోషించారు.
యాసిన్ భత్కల్ ఆధ్వర్యంలోవరుస బాంబు పేలుళ్లు
2005 నుంచి ఐఎం కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2007లో లుంబినీ పార్క్, గోకుల్‌చాట్ జంట బాంబు పేలుళ్లు, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లతో రాష్ట్రంలో ఐఎం టెర్రరిస్టులు విధ్వంసం సృష్టించారు.2008లో ఢిల్లీలో కూడా వరుస బ్లాస్టింగ్స్ కు పాల్పడ్డారు. ఈ క్రమంలో అదే ఏడాది సెప్టెంబర్ 19న ఢిల్లీ జామియా నగర్‌లోని బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా ఐఎం టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించడం మొదలుపెట్టారు. ఉగ్రవాద భావజాలం ఉన్న యువతను ట్రాప్ చేసి తమ టార్గెట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో యాసిన్ భత్కల్‌ను 2013 ఆగస్ట్ 28న ఇండో– నేపాల్ బోర్డర్‌లో బిహార్ ఏటీఎస్ అరెస్టు చేసింది. కానీ ఇక్బాల్, రియాజ్ భత్కల్ మాత్రం ఇప్పటికీ చిక్కలేదు. వారిద్దరు దుబాయ్, అరబ్ దేశాల్లో ఆశ్రయం తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
మంగళూరులో షెల్టర్
2009లో మంగళూరు శివారు ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్ లో ఇక్బాల్ భత్కల్, రియాజ్ భత్కల్ ఉన్నట్లు సమాచారం అందడంతో ముంబై ఏటీఎస్ పోలీసులు అక్కడికి వెళ్లారు. ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకునేందుకు యత్నించారు. కానీ, వారు షెల్టర్ తీసుకున్న అపార్ట్‌మెంట్‌లోకి ఏటీఎస్ పోలీసులు ప్రవేశించడానికి నిమిషాల వ్యవధిలోనే భత్కల్ బ్రదర్స్ గ్యాంగ్ అక్కడి నుంచి తప్పించుకుంది. అప్పటి నుంచి ప్రాంతాలు మారుస్తూ మారు పేర్లతో తిరుగుతున్నారు.ఈ క్రమంలోనే యాసిన్ భత్కల్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్‌ఐఏ, ఏటీఎస్ పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. ఇక్బాల్, రియాజ్ సెల్‌ఫోన్స్ వినియోగించరని గుర్తించారు. దీనికి తోడు తమ ఉనికి బయటపడకుండా మారు వేషాల్లో తిరుగుతున్నారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. విధ్వంసాలకు పాల్పడేందుకు, టాస్క్ సమయంలో అవసరమైన వారితో మాట్లాడేందుకు పబ్లిక్ టెలిఫోన్ ఉపయోగిస్తున్నారని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి.
టాస్క్‌ల కోసం వారానికో సిమ్ కార్డ్
సెల్‌ఫోన్ ఉయోగించాల్సిన అవసరం వస్తే ప్రతి వారానికి ఓ సిమ్ కార్డు మార్చుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తమకు చిక్కకుండా పక్కా ప్లాన్‌తో పారిపోతున్నట్లు ఆధారాలు సేకరించారు. పాకిస్తాన్, దుబాయ్‌లో షెల్టర్ తీసుకునే అవకాశాలు ఉండడంతో ఇప్పటికే పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ప్రతి ఎయిర్ పోర్టులో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే స్థానిక ఇమిగ్రేషన్, సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రాష్ట్ర పోలీసులు, కౌంటర్ ఇంటెలిజెన్స్‌తో కలిసి అనుమానిత ప్రాంతాలపై దృష్టి పెట్టారు. షెల్టర్ తీసుకునేందుకు అవకాశాలు ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు. భత్కల్ బ్రదర్స్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా 011–-2436 8800 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా న్యూఢిల్లీ లోధి రోడ్‌లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని చెప్పారు.