హైదరాబాద్‌లో విధ్వంసాలకు లష్కరే కుట్ర
దసరా ఉత్సవాలు.. బీజేపీ-, ఆర్‌ఎస్ఎస్ సభలే టార్గెట్
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో వరుస బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన లష్కరే తోయిబా కుట్ర కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) బుధవారం ఎన్ఐఏ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. బాంబు పేలుళ్లకు కుట్ర చేసిన మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ జాహెద్, సమీయుద్దీన్ అలియాస్ సమీ, మాజ్ హసన్ ఫారూక్ అలియాస్ మాజ్‌లపై అభియోగాలు మోపింది. నిధులు, పేలుడు పదార్థాలు సేకరించడం, రిక్రూట్‌మెంట్ చేయడం వంటి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించారని చార్జిషీటులో ఎన్ఐఏ పేర్కొంది.
నిరుడు దసరా ఉత్సవాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సమావేశాలు, ర్యాలీల్లో హ్యాండ్ గ్రెనేడ్లలతో దాడులు చేసేందుకు నిందితులు ప్లాన్ చేశారని తెలిపింది. ఈ కేసులో అక్టోబర్ 2న మలక్‌పేట్ మూసారాంబాగ్‌కి చెందిన అబ్దుల్ జాహెద్, సైదాబాద్ అక్బర్‌బాగ్‌కి చెందిన సమీయుద్దీన్, హుమాయున్ నగర్ రాయల్ కాలనీకి చెందిన మాజ్ హసన్ ఫరూక్‌లను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, రూ.5.41 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
లష్కరే తోయిబా ఫండింగ్, రిక్రూట్‌మెంట్
దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించేందుకు లష్కరే తోయిబా నుంచి నిధులు అందడంతో నిరుడు సెప్టెంబర్ 28న ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి కేసు దర్యాప్తు ప్రారంభించింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఫర్హతుల్లా ఘోరీతో జాహెద్, సమీ, మాజ్‌కు సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు సిద్ధిఖ్ బిన్ ఉస్మాన్ అలియాస్ అబు హంజాలా, అబ్దుల్ మజీద్ అలియాస్ ఛోటూ సహా ఇతర టెర్రరిస్టులతో వారికి కాంటాక్టులు ఉన్నట్లు ఆధారాలు సేకరించింది.
ఫర్హతుల్లా ఘోరీ సహకారంతో హైదరాబాద్‌లోని రద్దీగా ఉండే ప్రదేశాల్లో వరుస బాంబు పేలుళ్లు జరపాలని నిందితులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఘోరీ సైబర్ స్పేస్ నుంచి జాహెద్‌ను రిక్రూట్ చేసి హవాలా ద్వారా నిధులు పంపాడని గుర్తించింది. ఆ డబ్బుతో జాహెద్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేయడంతో పాటు మరికొంత మంది యువతను లష్కరే తోయిబాలో రిక్రూట్ చేశాడని చార్జిషీట్‌లో ఎన్ఐఏ వెల్లడించింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న ఆదేశాలతో జాహెద్, సమీ, మాజ్ విధ్వంసాలకు ప్లాన్ చేసినట్లు ఆధారాలు సేకరించింది. ‘‘నిరుడు సెప్టెంబర్ 28న హైదరాబాద్ – -నాగ్‌పూర్ హైవేలోని మనోహరాబాద్ గ్రామ సమీపంలో నాలుగు హ్యాండ్- గ్రెనేడ్లు సేకరించాం.
వాటిలో రెండింటిని సమీ, మాజ్ వద్ద జాహెద్ భద్రపరిచాడు. దసరా పండుగ, బీజేపీ–ఆర్ఎస్ఎస్ సభలు, సమావేశాల్లో ఆ గ్రెనేడ్లతో దాడులు చేసేందుకు ప్లాన్ చేశారు. సమాచారం అందుకున్న టీఎస్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి నాలుగు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు” అని ఎన్ఐఏ తన చార్జిషీటులో తెలిపింది. ఈ మేరకు ఆధారాలను కోర్టుకు సమర్పించింది.