నిజామాబాద్ జిల్లాలో మరోసారి సోదాలకు ఎన్ఐఏ అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్లో జూలై 4న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కార్యక్రమాల ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ తో పాటు.. మరో ముగ్గురిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ సోదాల్లో 8 లక్షలకు పైగా నగదు, పలు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి తనిఖీలకు సహకరించాలని జిల్లా పోలీసులను ఎన్ఐఏ అధికారులు కోరారు. సీఐతో పాటు ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు కానిస్టేబుళ్లతో ఉన్న టీమ్ కావాలని తెలిపారు.
సెప్టెంబర్ 18న ఎన్ఐఏ సోదాల సమయంలో పలువురు పీఎఫ్ఐ కార్యకర్తలు ఇండ్లల్లో లేకపోవడంతో.. ఇప్పుడు మళ్లీ తనిఖీలు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో సోదాల తర్వాత కొందరికి ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకానట్టు సమాచారం. జిల్లా పీఎఫ్ఐలో కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు అహాన్ అచూకీ ఇప్పటివరకు దొరకలేదు. అతని కోసం ఎన్ఐఏ, పోలీసు అధికారులు గాలిస్తున్నారు.