కొచ్చి: 2010లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళలో ‘ప్రొఫెసర్ చేయి నరికిన కేసు’లో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థకు చెందిన ప్రధాన నిందితులు ముగ్గురికి పదేండ్లు, వీరికి ఆశ్రయం ఇచ్చిన మరో ముగ్గురికి మూడేండ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా తొడుపుజలోని న్యూమాన్ కాలేజీలో టీజే జోసెఫ్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు.
కాలేజీ బీకామ్ ఇంటర్నల్ పరీక్షల కోసం ప్రొఫెసర్ జోసెఫ్ తయారు చేసిన ప్రశ్నపత్రంలో ఓ ప్రశ్న ఇస్లాంను అవమానించేలా ఉందంటూ ‘పీఎఫ్ఐ’కి చెందిన ఓ ముఠా 2010 జులై 4న ఆయన కుడిచేతిని నరికేసింది. ప్రొఫెసర్ చేతిని నరికిన ప్రధాన నిందితుడు సవాద్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.