KKR vs LSG: పూరన్‌కు ఆరెంజ్ క్యాప్.. విండీస్ క్రికెటర్ మరో అరుదైన ఘనత!

KKR vs LSG: పూరన్‌కు ఆరెంజ్ క్యాప్.. విండీస్ క్రికెటర్ మరో అరుదైన ఘనత!

ఐపీఎల్ 2025 లో వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ వీర ఉతుకుడు ఉతుకుతున్నాడు. ఆడిన 5 మ్యాచ్ ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న పూరన్ మంగళవారం (ఏప్రిల్ 8) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 36 బంతుల్లోనే 87 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లతో పాటు ఏకంగా 8 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్ ల్లో 288 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం తన దగ్గరే ఉంచుకున్నాడు. 

పూరన్ తన విధ్వంసకర ఆటతో మరో మైల్ స్టోన్ చేరుకున్నాడు. ఐపీఎల్ లో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత అందుకున్న ఐదో వెస్టిండీస్ ప్లేయర్ గా నిలిచాడు. వెస్టిండీస్ తరపున ఇప్పటివరకు క్రిస్ గేల్ , కీరన్ పొలార్డ్, డ్వేన్ స్మిత్, ఆండ్రీ రస్సెల్ 2000 పరుగులు చేశారు. 29 ఏళ్ల ఈ విండీస్ వీరుడు కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో తనదైన షాట్లతో అలరించాడు. 

ఐపీఎల్ లో మంగళవారం (ఏప్రిల్ 8) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. భారీ ఛేజింగ్ లో కేకేఆర్ కెప్టెన్ రహానే (35 బంతుల్లో 61:8 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినప్పటికీ కీలక సమయంలో లక్నో బౌలర్లు వికెట్లు తీసి మ్యాచ్ గెలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్లను 204 పరుగులు చేసి ఓడిపోయింది.