T20 World Cup 2024: పూరన్ సిక్సర్ల మోత.. గేల్, సూర్యల రికార్డ్ బ్రేక్

T20 World Cup 2024: పూరన్ సిక్సర్ల మోత.. గేల్, సూర్యల రికార్డ్ బ్రేక్

టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ విశ్వరూపం చూపించాడు. సొంతగడ్డపై మంగళవారం (జూన్ 18) ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. ఇతని ఇన్నింగ్స్ లో ఫోర్లు కంటే సిక్సర్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఈ క్రమంలో తన దేశం తరపున ఒక రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

అంతర్జాతీయ టీ20 కెరీర్ లో పూరన్ ఇప్పటివరకు 128 సిక్సర్లు కొట్టాడు. దీంతో వెస్టిండీస్ తరపున ఈ ఫార్మాట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా సరికొత్త రికార్డ్ సృష్టించాడు. నిన్నటివరకు ఈ రికార్డ్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (124) పేరిట ఉంది. దీంతో పాటు పూరన్ టీమిండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. సూర్య అంతర్జాతీయ టీ20 ల్లో 125 సిక్సర్లు బాదాడు. ఓవరాల్ గా ఈ లిస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 194 సిక్సర్లతో టాప్ లో ఉన్నాడు. గప్తిల్(173), బట్లర్(130), స్టిర్లింగ్(129) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. 

ఇదే మ్యాచ్ లో పూరన్ మరో ధాటికి మరో ప్రపంచ రికార్డ్ వచ్చి చేరింది. అజ్మతుల్లా ఒమర్జాయ్  వేసిన 4వ ఓవర్లో ఏకంగా 36 పరుగులు వచ్చాయి. ఇందులో పూరన్ 3 సిక్సులు, 2 ఫోర్లతో 26 పరుగులు చేయగా.. మిగితా 10 పరుగులు బైస్ రూపంలో వచ్చాయి. దీంతో టీ20ల్లో  ఒకే ఓవర్లో అత్యధిక పరుగుల రికార్డ్ సమం అయింది. పూరన్ విధ్వంసంతో ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన లీగ్ చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.