సవాల్ విసురుతున్న పిచ్‌లపై బౌలర్ల హవా నడుస్తున్న టీ20 వరల్డ్ కప్‌లో పరుగుల మోత మోగింది. సూపర్8 రౌండ్‌కు ముందు ఆతిథ్య వెస్టిండీస్ తన బ్యాట్ పవర్ చూపెట్టింది. నికోలస్ పూరన్ (53 బాల్స్‌లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 98) పూనకం వచ్చినట్టు ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. దాంతో మంగళవారం జరిగిన చివరి గ్రూప్–-సి మ్యాచ్‌లో విండీస్ 104 రన్స్ తేడాతో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసింది. ఇరు జట్లూ ఇప్పటికే సూపర్–8 రౌండ్ చేరగా.. తొలి రౌండ్ ఆఖరి మ్యాచ్‌లో కరీబియన్లు అఫ్గాన్‌ను ఓ ఆటాడుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 218/5 స్కోరు చేసింది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికి ఇదే అత్యధిక స్కోరు. టీ20 వరల్డ్ కప్‌లో విండీస్‌కు అత్యుత్తమం కావడం గమనార్హం. పూరన్‌కు తోడు జాన్సన్ చార్లెస్ (27 బాల్స్‌లో 8 ఫోర్లతో 43) రాణించాడు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్ రెండు వికెట్లు పడగొట్టాడు. తర్వాత భారీ టార్గెట్ ఛేజింగ్‌లో అఫ్గాన్ 16.2 ఓవర్లలో 114 రన్స్‌కే కుప్పకూలింది. ఇబ్రహీం జద్రాన్ (38), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (23) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. హోమ్‌టీమ్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్ మూడు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బకొట్టగా.. అకీల్ హుస్సేన్, గుడకేశ్ మోతీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పూరన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 20న జరిగే సూపర్8 రౌండ్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో వెస్టిండీస్, ఇండియాతో అఫ్గానిస్తాన్ పోటీ పడతాయి.
ఒకే ఓవర్లో 36.. పవర్ ప్లేలోనే 92/1 ఈ పోరుకు ముందే టాప్ ప్లేస్‌తో సూపర్8 బెర్తు దక్కించుకున్న విండీస్ స్వేచ్ఛగా ఆడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చి ఆరంభం నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (7), జాన్సన్ చార్లెస్ చెరో బౌండ్రీతో తమ ఉద్దేశం ఏంటో చెప్పారు. అజ్మతుల్లా వేసిన రెండో ఓవర్లో చార్లెస్ రెండు ఫోర్లతో జోరందుకోగా.. బ్రెండన్ బౌల్డ్ అవడంతో అఫ్గాన్‌కు ఫస్ట్ బ్రేక్ లభించింది. కానీ, ఈ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఫజల్‌హక్ ఓవర్లో చార్లెస్ మూడు ఫోర్లతో మరింత స్పీడు పెంచగా.. వచ్చీరాగానే పూరన్ రెచ్చిపోయాడు. అజ్మతుల్లా వేసిన నాలుగో ఓవర్లో 6, 4, 4, 6, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఎక్స్‌ట్రాలతో కలిపి ఆ ఓవర్లో ఏకంగా 36 రన్స్ వచ్చాయి. ఐదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన స్పిన్నర్ రషీద్‌కు పూరన్ రెండు ఫోర్లతో వెల్‌కం చెప్పగా.. పవర్ ప్లేను విండీస్ రికార్డు స్థాయిలో 92/1 స్కోరుతో ముగించింది. వరల్డ్ కప్‌లో పవర్ ప్లేలో ఓ జట్టుకు ఇదే టాప్ స్కోరు. ఫీల్డింగ్ మారిన తర్వాత నూర్ అహ్మద్, నవీన్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ రన్స్ నియంత్రించారు. ఈ క్రమంలో చార్లెస్‌ను నవీన్ వెనక్కుపంపడంతో రెండో వికెట్‌కు 80 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 7 నుంచి 10 ఓవర్లలో ఒకే బౌండ్రీ రావడంతో విండీస్ రన్‌రేట్ తగ్గింది. 11వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన షై హోప్ (25)ను గుల్బదిన్ ఔట్ చేశాడు. అఫ్గాన్ బౌలర్లు వరుసగా నాలుగు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వకపోవడంతో 15 ఓవర్లకు 148/3తో నిలిచిన విండీస్ 200 చేస్తే గొప్పే అనిపించింది. కానీ, స్లాగ్ ఓవర్లలో పూరన్ మళ్లీ టాప్ గేర్‌లోకి వచ్చాడు. 16వ ఓవర్లో రోవ్‌మన్ పావెల్ (26 ) సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకురాగా.. నవీన్ బౌలింగ్ లో పూరన్ రెండు ఫోర్లతో స్పీడందుకున్నాడు. రషీద్ వేసిన 18వ ఓవర్లో 6, 4, 6, 6తో విజృంభించాడు. గుల్బదిన్ బౌలింగ్‌లో ఇంకో సిక్స్ కొట్టిన పావెల్ మరో షాట్‌కు ట్రైచేసి ఔటయ్యాడు. నవీస్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన పూరన్ డబుల్ తీసే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. రెండు రన్స్ తేడాలో సెంచరీ చేజార్చుకున్నా జట్టుకు భారీ స్కోరు అందించాడు.
అఫ్గాన్ ఢమాల్
కరీబియన్ బ్యాటర్లు దంచికొట్టిన వికెట్‌పై అఫ్గాన్ తేలిపోయింది. ప్రత్యర్థి బౌలింగ్ ధాటిని తట్టుకోలేక వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో బాల్‌కే ఓపెనర్ గుర్బాజ్ (0)ను డకౌట్ చేసిన అకీల్ హుస్సేన్ ఆ టీమ్‌ను దెబ్బకొట్టాడు. ఇబ్రహీం జద్రాన్, గుల్బదిన్ నైబ్ (7) పోరాటంతో పవర్ ప్లేలో 45/1తో నిలిచిన అఫ్గాన్ తర్వాత తడబడింది. ఏడో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన మోతీ.. గుల్బదిన్‌ను ఎల్బీ చేసి ఈ జోడీని విడదీశాడు. ఆ వెంటనే మెకాయ్ బౌలింగ్‌లో ఇబ్రహీం, నజీబుల్లా జద్రాన్ (0) పెవిలియన్ చేరారు. తన తర్వాతి ఓవర్లోనే మహ్మద్ నబీ (0)ని బౌల్డ్ చేసిన మెకాయ్ 63/5తో అఫ్గాన్‌ను కోలుకోలేకుండా చేశాడు. కరీం జన్నత్ (14), అజ్మతుల్లా (23) కాసేపు మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. నూర్ అహ్మద్ (2), నవీన్ (4) ఫెయిలవగా.. రెండు ఫోర్లు, సిక్స్ కొట్టిన రషీద్ ఖాన్ (18) రసెల్ బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు.