
నిఫ్ట్.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ విద్యాసంస్థ నిఫ్ట్ అడ్మిషన్స్ టెస్ట్-2024కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా ఉన్న నిఫ్ట్ క్యాంపస్‌ల్లో.. ఫ్యాషన్, డిజైనింగ్‌కు సంబంధించి బ్యాచిలర్, పీజీ కోర్సుల్లో అడుగు పెట్టొచ్చు. నిఫ్ట్ కోర్సులు పూర్తి చేసుకుంటే.. ఫ్యాషన్ రంగంలో ఉజ్వల కెరీర్ అవకాశాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో.. నిఫ్ట్ అడ్మిషన్ ప్రక్రియ, కోర్సులు, సీట్లు, సెలెక్షన్ ప్రాసెస్‌లో ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసుకుందాం..
కేంద్ర టెక్స్‌టైల్ శాఖ ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించి ఆధునిక నైపుణ్యాలు అందించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నిఫ్ట్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. నిఫ్ట్‌కు ప్రస్తుతం జాతీయ స్థాయిలో 18 క్యాంపస్‌ల్లో పది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇంటర్ అర్హతతో అడ్మిషన్స్ లభించే బ్యాచిలర్ స్థాయి కోర్సులు ఏడు, డిగ్రీ అర్హతతో ప్రవేశం కల్పించే పీజీ కోర్సులు మూడు ఉన్నాయి. నిఫ్ట్ క్యాంపస్‌ల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏటా నిఫ్ట్-అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. తాజగా 2024-–25 విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్‌కు సెలెక్షన్ ప్రాసెస్ మొదలైంది.
డిగ్రీ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్, లెదర్ డిజైన్, యాక్ససరీ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, నిట్‌వేర్ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్; బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ- అపెరల్ ప్రొడక్షన్. ఈ కోర్సులకు ఇంటర్మీడియెట్ ఏ గ్రూప్ విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితోపాటు ఏఐసీటీఈ లేదా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు పొందిన మూడు లేదా నాలుగేళ్ల వ్యవధిలోని డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణులు కూడా దరఖాస్తుకు అర్హులే. నిఫ్ట్ అందిస్తున్న ప్రోగ్రామ్‌లలో ప్రత్యేకమైనది బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్.టెక్). ఇది ఫ్యాషన్ విభాగంలో టెక్నికల్ నైపుణ్యాలను అందించే ప్రత్యేక కోర్సు. ఇందులో ప్రవేశానికి దరఖాస్తు చేయాలనుకుంటే.. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ కోర్సుకు మూడు/నాలుగేళ్ల వ్యవధిలోని డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ ప్రోగ్రామ్స్: పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో.. మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ లేదా నిఫ్ట్/నిడ్ నుంచి డిప్లొమా లేదా అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి నిఫ్ట్ అందించే బీ.ఎఫ్‌టెక్ ఉత్తీర్ణులు లేదా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి బీటెక్/బీఈ ఉత్తీర్ణులు అర్హులు. 2024 ఆగస్ట్ 1 నాటికి 24 సంవత్సరాలలోపు ఉండాలి. పీజీ ప్రోగ్రామ్‌లకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు.
ఎగ్జామ్ ప్యాటర్న్
నిఫ్ట్-అడ్మిషన్ ప్రక్రియను ఆయా కోర్సులను బట్టి మూడు దశల్లో నిర్వహిస్తారు. యూజీ, పీజీ కోర్సులకు తొలి దశలో జనరల్ ఎబిలిటీ టెస్ట్(జీఏటీ) ఉంటుంది. ఆ తర్వాత క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (సీఏటీ), సిట్యుయేషన్ టెస్ట్ ఉంటాయి. పీజీ కోర్సులకు పర్సనల్ ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్‌లు నిర్వహిస్తారు.
జనరల్ ఎబిలిటీ టెస్ట్: తొలి దశలో నిర్వహించే జీఏటీ (జనరల్ ఎబిలిటీ టెస్ట్)ని బ్యాచిలర్, పీజీ కోర్సుల అభ్యర్థులు ఇద్దరికీ నిర్వహిస్తారు. పరీక్ష ప్రశ్నల క్లిష్టత స్థాయి మాస్టర్ కోర్సుల్లో కొంత ఎక్కువగా ఉంటుంది. బీడిజైన్ జేఏటీ పేపర్‌లో 100 ప్రశ్నలు ఉంటాయి, పరీక్ష సమయం రెండు గంటలు. ఎండిజైన్ జీఏఈ పేపర్‌లో 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.
జీఏటీలో.. క్వాంటిటేటివ్ ఎబిలిటీ; కమ్యూనికేషన్ ఎబిలిటీ; ఇంగ్లిష్ కాంప్రహెన్షన్; అనలిటికల్ ఎబిలిటీ; జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులకు కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ రెండు విభాగాలు కలిపి 40 ప్రశ్నలు అడుగుతారు.
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు తొలి దశ ప్రవేశ పరీక్ష జీఏటీ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో క్యాంటిటేటివ్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు ఒక కేస్ స్టడీ కూడా ఉంటుంది. మొత్తంగా ఈ పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు.
క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్: మొదటి దశలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశలో.. క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్ (సీఏటీ) నిర్వహిస్తారు. అభ్యర్థుల్లోని పరిశీలనాత్మక నైపుణ్యం, సృజనాత్మకత, డిజైన్ సామర్థ్యాలను పరీక్షించే విధంగా ఈ పరీక్ష ఉంటుంది.
సిట్యుయేషన్ టెస్ట్: రెండు దశల్లో చూపిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకుని యూజీ కోర్సులకు సిట్యుయేషన్ టెస్ట్ నిర్వహిస్తారు.అభ్యర్థుల సృజనాత్మక ప్రతిభను పరిశీలించే విధంగా పరీక్ష ఉంటుంది.
గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ: జీఏటీ, సీఏటీలలో విజయం సాధించిన పీజీ అభ్యర్థులకు చివరగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.భావ వ్యక్తీకరణ సామర్థ్యం, విషయ పరిజ్ఞానం, ఆలోచన సామర్థ్యాలను పరీక్షించే విధంగా గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. పర్సనల్ ఇంటర్వ్యూ పూర్తిగా ఫ్యాషన్ కెరీర్ పట్ల అభ్యర్థికున్న ఆసక్తి, దానికి సరితూగే తత్వాలను గ్రహించే విధంగా ఉంటుంది.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జనవరి 3 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 5న ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. సిట్యుయేషన్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.nift.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.
ప్రిపరేషన్ ప్లాన్:
అనలిటికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ: విశ్లేషణ సామర్థ్యాన్ని, తార్కిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. నిర్దిష్టంగా ఒక అంశంలో ఇమిడి ఉన్న ప్రధాన అంశాలు, వాటికి సంబంధించి అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: ఈ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు హైస్కూల్ స్థాయి సోషల్ సబ్జెక్ట్ నుంచి ఉంటాయి. అదే విధంగా ముఖ్యమైన తేదీలు-సందర్భాలు వంటివి కూడా అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు తాజాగా జరిగిన ముఖ్యమైన సంఘటనలు కూడా తెలుసుకోవాలి.
క్వాంటిటేటివ్ ఎబిలిటీ: మ్యాథమెటిక్స్, అర్థమెటిక్స్ అంశాలపై పట్టు సాధించాలి. వర్క్ అండ్ టాస్క్, శాతాలు, నిష్పత్తులు, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్‌కు సంబంధించిన అంశాలు ప్రాక్టీస్ చేయాలి.
కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్: ఇంగ్లీష్ భాషలో ప్రాథమిక నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బేసిక్ గ్రామర్ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
కేస్ స్టడీ: బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌కోర్సు అభ్యర్థులకు నిర్వహించే కేస్ స్టడీ.. ఒక వాస్తవ సమస్యను ఇచ్చి దానికి పరిష్కారం అడిగేలా ఉంటుంది. అభ్యర్థులకు అన్వయ దృక్పథం, సమస్యను గుర్తించే లక్షణం అవసరం.
వెయిటేజీ: నిఫ్ట్ ఎంట్రెన్స్‌లో మూడు దశల్లోనూ ప్రతిభ చూపిన వారితో మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆయా టెస్ట్‌లలో పొందిన మార్కులకు నిర్దిష్ట వెయిటేజీ కల్పిస్తూ ఈ జాబితాను తయారుచేస్తారు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులకు సీఏటీకి 50 శాతం, జీఏటీకి 30 శాతం, సిట్యుయేషన్ టెస్ట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు జీఏటీ సెక్షన్-ఎకు 70 శాతం; జీఏటీ సెక్షన్-బికు 30 శాతం వెయిటేజీ ఇస్తారు. మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుకు సీఏటీకి 40 శాతం, జీఏటీకి 30 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ కల్పిస్తారు. మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు జీఏటీకి 70 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.