
ముంబై: చాలా రోజుల తరువాత ఇండియన్ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బెంచ్‌మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం 740 పాయింట్లు పెరిగింది. యుటిలిటీస్, పవర్ షేర్లలో వాల్యూ బయింగ్, ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో నిఫ్టీ తన 10 రోజుల నష్టాలకు బ్రేక్ వేసింది. 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 740.30 పాయింట్లు (1.01 శాతం) పెరిగి 73,730.23 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 943.87 పాయింట్లు దూసుకెళ్లింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 254.65 పాయింట్లు (1.15 శాతం) పెరిగి 22,337.30 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 312.25 పాయింట్లు పెరిగి 22,394.90 స్థాయికి చేరుకుంది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ గేజ్ 2.80 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.66 శాతం పుంజుకోవడంతో బ్రాడ్ మార్కెట్లు కూడా లాభపడ్డాయి.
బీఎఎస్ఈ -లిస్టెడ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7,97,247.7 కోట్లు పెరిగి రూ. 3,93,04,041.75 కోట్లకు ( 4.51 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్ ప్యాక్ నుంచి అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఐటీసీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతి ఎయిర్‌టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆసియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభపడ్డాయి.
బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జొమాటో వెనకబడి ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు ఇండెక్స్‌లను కోలుకునేలా చేశామని, ట్రంప్ ప్రభుత్వం కొన్ని సుంకాలను వెనక్కి తీసుకోవచ్చనే అంచనాలు మార్కెట్లలో ఉత్సాహం నింపాయని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ సీనియర్ వీపీ (రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే అన్నారు. పీఎంఐ ఇండెక్స్ పెరుగుదల వంటివీ మార్కెట్లలో సెంటిమెంట్‌ను పెంచాయని చెప్పారు.
సెక్టోరల్ ఇండెక్స్‌ల దూకుడు
బీఎస్ఈలోని అన్ని సెక్టోరల్ సూచీలు లాభాలతో ముగిశాయి. యుటిలిటీస్ 4.40 శాతం, పవర్ 3.67 శాతం, సర్వీసెస్ 3.64 శాతం, మెటల్ 3.52 శాతం, టెలికమ్యూనికేషన్ 3.36 శాతం, కమోడిటీస్ 2.88 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.46 శాతం పెరిగాయి. బీఎస్ఈలో 3,247 స్టాక్‌లు పెరగగా, 768 తగ్గాయి. అమెరికా డాలర్ బలహీనపడుతుండటంతో భారతదేశంతో సహా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు పుంజుకున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.
మెక్సికో, కెనడా, చైనాలపై అమెరికా సుంకాలు విధించినప్పటికీ బెదరలేదన్నారు. ఇదిలా ఉంటే, ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్, సియోల్ లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ మంగళవారం నష్టాలతో ముగిసింది. బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ రేటు 0.49 శాతం తగ్గి 70.69 డాలర్లకు చేరుకుంది. ఎఫ్ఐఐలు మంగళవారం రూ. 3,405.82 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు.